New Delhi, January 15: ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికల జీవోపై (AP Local Body Polls) సుప్రీంకోర్ట్ స్టే విధించింది. ఎన్నికల రిజర్వేషన్లకు (Reservations) సంబంధించి జగన్ ప్రభుత్వం నిబంధనలు అతిక్రమించిందని ఏపీ రెడ్డి సంక్షేమ సంఘం కార్యదర్శి ప్రతాపరెడ్డి సుప్రీంకోర్టు (Supreme Court) లో పిటిషన్ వేశారు. గతంలో సుప్రీం ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతానికి మించి, 59.85 శాతంగా రిజర్వేషన్ కల్పించారు. ఈ ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధం అంటూ పిటిషన్ లో పేర్కొన్నారు.
దీనిపై ఈరోజు విచారణ జరిపిన సుప్రీంకోర్ట్, రిజర్వేషన్ విధానాన్ని తప్పుపట్టింది. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 176 పై స్టే విధించింది. ఈ వ్యవహారంపై నాలుగు వారాల్లో విచారణ పూర్తిచేయాలని రాష్ట్ర హైకోర్టును సుప్రీంకోర్ట్ ఆదేశించింది. 2010లో సుప్రీంకోర్ట్ రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగానే ఎన్నికలు జరగాలని సుప్రీం సూచించింది. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల పూర్తి షెడ్యూల్, ఇతర వివరాలు ఇలా ఉన్నాయి
స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్ సర్కార్ 59.85 శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని తప్పుపడుతూ ప్రతాపరెడ్డి ముందుగా హైకోర్టును ఆశ్రయించారు. అయితే దీనిపై విచారించిన హైకోర్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసినప్పటికీ ఎన్నికల ప్రక్రియ కొనసాగించవచ్చునని సూచించింది. ఈనెల 17న నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. దీంతో ఆయన సుప్రీంను ఆశ్రయించడంతో, ఈ వ్యవహారాన్ని తేల్చాలంటూ సుప్రీంకోర్ట్ హైకోర్టుకు సూచించింది.