Tension Erupts in Dharmavaram (Photo-X)

ఏపీలోని సత్యసాయి జిల్లా ధర్మవరంలో రెండు కార్లలో వెళ్తోన్న టీడీపీ, వైసీపీ వర్గీయుల దాడి ఘటన కలకలం రేపింది. దీంతో జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘర్షణలో రాళ్ల దాడికి పాల్పడటంతో రెండు కార్లు, నాలుగు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. పలువురు గాయపడ్డారు. వైసీపీ మైనార్టీ నాయకుడు జమీర్ బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి సత్యకుమార్ సమక్షంలో సోమవారం జమీర్ తన అనుచరులతో బీజేపీలో చేరనున్నారు.

విజయసాయిరెడ్డి రాజీనామాపై టీడీపీ నేత బుద్దా వెంకన్న సంచలన కామెంట్.. ఇదంతా జగన్‌ ఆడుతున్న డ్రామా అని ఫైర్, దేశం విడిచి వెళ్లేందుకు అనుమతివ్వకూడదని డిమాండ్

ఈ నేపథ్యంలో జమీర్ అనుచరులు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే జమీర్ బీజేపీలో చేరడాన్ని నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్ వర్గీయులు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జమీర్ వర్గం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కొందరు చింపివేయడంతో వివాదం మొదలైంది. ధర్మవరంలోని పల్లకి సర్కిల్ రోడ్డులో టీడీపీ వర్గీయుల వాహనాలపై జమీర్ అనుచరులు దాడి చేశారు. స్థానికులు డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించడంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు.

TDP VS YCP Fight in Dharmavaram

పోలీసుల ఎదుటే ఇరువర్గాలు బాహాబాహీకి దిగడంతో పలువురు టీడీపీ నాయకులు గాయపడ్డారు. కొన్ని వాహనాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. గాయపడిన వారిని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు