ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుంచి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే ఐదు రోజులు రెండు నుంచి నాలుగు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరుగుతాయని పేర్కొంది. ఇదిలా ఉంటే ఆదివారం నుంచే అనేక ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నంలో 41.9 డిగ్రీలు, చింతూరులో 41.5, కూనవరంలో 40.1, తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో 41.9, కోరుకొండలో 40.3, రాజమండ్రిలో 40.6, రాజానగరంలో 40.7, ఏలూరు జిల్లా భీమడోలులో 41.6, ద్వారకా తిరుమలలో 41.2, కాకినాడ జిల్లా శంఖవరంలో 40.3, అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి, ముమ్మిడివరంలో 41.8, నంద్యాల జిల్లా కొత్తపల్లెలో 40 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదయింది.
ఇక పగిడ్యాలలో 40.5, పల్నాడు జిల్లా నకరికల్లులో 40, పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టంలో 41.2, ప్రకాశం జిల్లా కొనకనమిట్లలో 41.2, జరుగుమిల్లిలో 40.6, శ్రీకాకుళం జిల్లా బుర్జలో 40, కోటబొమ్మాళిలో 40.4, లక్ష్మీనరసుపేటలో 40.2, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కొండాపురంలో 41.3, వరికుంటపాడులో 41, విజయనగరం జిల్లా కొత్తవలసలో 40.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చాలాచోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డారు.
ఎండల దెబ్బకు కర్నూలు జిల్లా గోనెగండ్లలోని నరసప్ప దేవాలయం దగ్గర ఉన్న పెద్ద కొండరాయి రెండుగా చీలిపోయింది. ఆదివారం మధ్యాహ్నం రెండుగంటల సమయంలో పెద్ద శబ్దం రావడంతో గ్రామస్తులు ఒక్కసారిగా వచ్చి పరిశీలించారు. కొండరాయి పగిలిన దగ్గర నుంచి పొగలు రావడం, రాయి చిన్నచిన్న ముక్కలుగా పడిపోతుండటాన్ని గమనించారు. ఎండ ఎక్కువగా ఉండటంతో కొండరాయి పగిలిందని తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది చెప్పారు.