Image: Twitter

వైసిపి జనసేన శ్రేణుల పరస్పర ఘర్షణలతో వైజాగ్ నగరం అట్టుడికింది.  ఓవైపు వైసిపి విశాఖ గర్జన మరోవైపు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటన తో వైజాగ్ పొలిటికల్ రంగు పులుముకుంది.  మధ్యాహ్నం వైసిపి ఆధ్వర్యంలోని విశాఖ గర్జన ఎట్టకేలకు శాంతియుతంగా  ముగిసిందని పోలీసులు ఊపిరి పీల్చుకోగా,  సాయంత్రం మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాకతో ఉద్రిక్తతలకు దారితీసింది.

విశాఖ ఎయిర్ పోర్టు దగ్గర ఉద్రిక్తత నెలకొంది. మంత్రులు రోజా, జోగి రమేశ్ లతో పాటు వైవీ సుబ్బారెడ్డి కార్లపై దాడులు జరిగాయి. జనసేన కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడినట్లు సమాచారం. దీంతో విమానాశ్రయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఎయిర్ పోర్టుకు వెళ్తుండగా తమ కార్లపై జనసేన కార్యకర్తలు దాడి చేశారని మంత్రి జోగి రమేశ్ ఆరోపిస్తున్నారు. మంత్రి రోజా ప్రయాణిస్తున్న కారు పై గుర్తుతెలియని వ్యక్తులు బైక్ హెల్మెట్ తో దాడి చేసినట్లు తెలుస్తోంది. 

పవన్ కళ్యాణ్ తమ పార్టీ కార్యకర్తలను అదుపులో ఉంచుకోవాలని మంత్రి జోగి రమేష్ సూచించారు.అరాచకశక్తులు చేసే కార్యక్రమం ఇదని మండిపడ్డారు. దాడులు చేయడం మంచి పద్ధతి కాదన్న మంత్రి జోగి.ఇలాంటి సంఘటనలను ఊరుకునేది లేదని హెచ్చరించారు.