Chittoor, Nov 3: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం (Chittoor Road Accident) జరిగింది. మదనపల్లి సమీపంలోని బండకిందపల్లి వద్ద ప్రైవేట్ బస్సు బోల్తా పడిన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి (Three People Deceased) చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను మదనపల్లి ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. కాగా ప్రమాదంలో మృతి చెందిన వారిని సోమశేఖర్, మల్లికార్జున, గంగుల్లప్పగా గుర్తించారు.
ఇక కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. పాణ్యం మండలం కౌలూరులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్యాభర్తలు తమ ఇద్దరు పిల్లలతో కలిసి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను నంద్యాల రోజాకుంటకు చెందిన గఫార్ కుటుంబ సభ్యులుగా గుర్తించారు.
భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త ఆత్మహత్య: మరో చోట భార్య మరణాన్ని తట్టుకోలేక ‘నీవు లేని జీవితం నాకొద్దు.. నేను నీ వద్దకే వస్తా’ అంటూ కొన్ని రోజులుగా కలవరించిన భర్త చివరకు ఆమె సమాధి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం ఆరెపల్లె గ్రామంలో ఆదివారం జరిగింది.
గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన లోమిట రాజు భార్య రమ్య క్యాన్సర్‌తో నాలుగేళ్ల క్రితం మృతిచెందింది. భార్య మృతిని తట్టుకోలేని రాజు తర్వాత మద్యానికి బానిసయ్యాడు. ‘రమ్య నేను నీవద్దకే వస్తానంటూ నిత్యం రోదిస్తుండే వాడు’. రాజు–రమ్య దంపతులకు సిరి(12), వైష్ణవి(9) కూతుర్లు ఉన్నారు.
ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం పత్తి చేను వద్దకు వెళ్తున్నానని కూతుళ్లకు చెప్పాడు. వారు కూడా తండ్రి వెనకాలే వెళ్లారు. రాజు భార్య సమాధి వద్దకు చేరుకుని రోదిస్తూ పురుగుల మందు తాగాడు. గమనించిన కూతుళ్లు పరుగున వచ్చి కుటుంబసభ్యులకు తెలిపారు. బంధువులు వెళ్లేసరికే రాజు స్ప్రహకోల్పోయాడు. వెంటనే పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తల్లిదండ్రుల మృతితో చిన్నారులు అనాథలయ్యారు. తండ్రికోసం చిన్నారుల రోదనలు గ్రామస్తులను కంటతడి పెట్టించాయి. కాల్వశ్రీరాంపూర్ ఎస్సై వెంకటేశ్వర్లు కేసు దర్యాప్తు చేస్తున్నారు.