Amaravati, June 28: తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం ఎల్.గన్నవరంలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం దగ్గర్లోని గోదావరిలో స్నానానికి వెళ్లిన పదో తరగతి విద్యార్థులు బండారు నవీన్‌కుమార్ (15), యర్రంశెట్టి రత్నసాగర్ (15), పంతాల పవన్ (15), ఖండవిల్లి వినయ్ (15) గల్లంతయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకుని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు గాలింపు చర్యలు పర్యవేక్షిస్తున్నారు. గాలింపు చర్యల్లో భాగంగా సోమవారం ఉదయం ముగ్గురు విద్యార్థుల మృతదేహాలు (Three students drown in Godavari river) లభ్యం అయ్యాయి.
మరొకరి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. లభ్యమైన మృతదేహాల్లో బండారు నవీన్, రత్నసాగర్, పంతాల పవన్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరు లంకల గన్నవరానికి చెందిన పదో విద్యార్ధులుగా పోలీసులు గుర్తించారు. ఆదివారం మధ్యాహ్నం ఇంటి వద్ద భోజనాలు చేసి ఆ నలుగురు విద్యార్థులు గోదావరి తీరానికి (Godavari river) ఆడుకొనేందుకు వెళ్లారు. రాత్రి ఏడు గంటలవుతున్నా తిరిగి రాలేదు. దీంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు.
గోదావరి తీరాన ఒక విద్యార్థి సైకిల్ ఉండటంతో అనుమానంతో ఇసుక తిన్నెల్లో గాలించారు. అక్కడ నలుగురు విద్యార్థుల దుస్తులు, మాస్కులు, రెండు సెల్‌ఫోన్లు లభ్యమయ్యాయి. దీంతో ఆ నలుగురు విద్యార్థులూ గోదావరిలో స్నానానికి దిగి, గల్లంతైనట్టు స్థానికులు అనుమానిస్తున్నారు.