tirumala-srivari-brahmotsavam-celebrations ( Photo-wikimedia commons)

Tirumala, september 29:  కలియుగ ప్రత్యక్షం దైవం, కొలిచినవారి కొంగుబంగారం శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది.తిరుమలేశుడి వార్షిక బ్రహ్మోత్సవాలకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. సెప్టెంబరు 30 నుంచి ప్రారంభమై మొత్తం తొమ్మిది రోజుల పాటు అక్టోబరు 8 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల కోసం ఏడుకొండలను ఇల వైకుంఠాన్ని తలపించేలా టీటీడీ అలంకరించింది.మాడ వీధుల్లో లక్షలాది మంది భక్తులు స్వామివారి వాహన సేవను తిలకించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలతో తిరుమల 9రోజుల పాటు దేదీప్యమానంగా వెలిగిపోనుంది. బ్రహ్మోత్సవాల ముందు రోజు వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణ కార్యక్రమంతో ఉత్సవం మొదలు కానుంది. ఉత్సవం నిర్వహించే ముందు అది విజయవంతం కావాలని కోరుతూ స్వామివారిని ప్రార్థించడమే ఈ కార్యక్రమంగా చెప్పవచ్చు. ఈ ఘట్టంలో స్వామివారి సర్వసైన్యాధక్షడైన విష్వక్సేనుడు రాత్రి 7 గంటలకు ఆలయం నుంచి ఊరేగింపుగా బయల్దేరి తినే మాడవీధుల్లోని వసంత మంటపానికి వేంచేస్తాడు. అక్కడ అర్చకస్వాములు పుట్టమన్ను సేకరించి నవపాలికలలో ఉంచుకొని ప్రదక్షిణగా తిరిగి ఆలయానికి వస్తారు. యాగశాలలో శాస్త్రోక్త కార్యక్రమాలను నిర్వహించి పాలికలలలోని పుట్టమన్నులో నవధాన్యాలను మొలకెత్తింపజేసే ప్రక్రియను వైదికంగా నిర్వహిస్తారు. దీంతో స్వామివారి బ్రహ్మోత్సవాలకు నాంది పలికినట్లవుతుంది.

మొక్కలకు అధిదేవుడు చంద్రుడు కాబట్టి.. రాత్రి సమయంలోనే ధాన్యాలను నాటడం చేస్తారు. అవి బాగా మొలకెత్తితే ఉత్సవం విజయవంతానికి సూచికగా భావిస్తారు. అనంతరం కొన్ని క్రతువులు నిర్వహించిన తర్వాతి రోజు నుంచి ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ ఉత్సవాలు అక్టోబరు 8న శ్రీవారికి చక్రస్నానంతో ముగుస్తాయి. ఈ తొమ్మిది రోజులూ మలయప్పస్వామి వివిధ రకాల వాహనాలపై ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు. ఉదయం 9 నుంచి 11గంటల వరకు, రాత్రి 8 నుంచి 10 గంటల వరకు స్వామికి వాహనసేవలు జరగనున్నాయి. శ్రీవారి ఉత్సవాలకు ఆలయ అధికారులు ఏపీ సీఎం జగన్ కు ఆహ్వానం అందించారు.

ఉత్సవాలకు ఏపీ సీఎంను ఆహ్వానిస్తున్న టీటీడీ అధికారులు

రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి జగన్ పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. రేపు సాయంత్రం ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.అనంతరం శ్రీవారి పెద్దశేష వాహనం ఊరేగింపు సేవలో పాల్గొననున్నారు. ఇప్పటికే తిరుమల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఆహ్వానించారు. ఆయనకు ఆహ్వాన పత్రికను కూడా అందించారు.

తెలంగాణా సీఎంకి ఆహ్వానం

బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలు ఎంతో వైభంగా నిర్వహిస్తారు. 30వ తేదీ ఉదయం ధ్వజారోహణం ఘట్టంలో రాత్రి పెద్ద శేషవాహనంపై శ్రీవారి దర్శనమివ్వనున్నారు. ఇలా ప్రతీ రోజూ ఉదయం ఒక వాహనం రాత్రి మరో వాహనంపై తిరు మాడవీధుల్లో విహరిస్తారు స్వామివారు. ఇక ఈ నెల 13న జరిగే చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

9 రోజుల ఘట్టాలు ఇవే

సెప్టెంబర్ 30న పెద్దశేష వాహనం

అక్టోబరు 1న చిన్నశేష వాహనం. హంస వాహనం,

అక్టోబరు 2న సింహవాహనం, ముత్యపు పందిరి వాహనం

అక్టోబరు 3న కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం

అక్టోబరు 4న మోహిని అవతారం, గరుడ వాహనం, ఉత్సవాల్లో అత్యంత ప్రాధాన్యత గలిగిన ఘట్టం ఇది. స్వామికి అత్యంత ప్రీతిపాత్రుడైన గరుడుడిపై ఉన్న స్వామిని దర్శిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం

అక్టోబరు 5న హనుమంత వాహనం, గజవాహనం

అక్టోబరు 6న సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం

అక్టోబరు 7న స్వర్ణ రథం, అశ్వ వాహనం

అక్టోబరు 8న చక్రస్నానం, ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం

మరోవైపు బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. పోలీసు యాంత్రాంగం అదనపు బలగాలతో పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తుగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇప్పటికే టీటీడి అధికారి అనిల్ కుమార్ సింఘాల్ ప్రకటించారు. స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా 12 రకాల పుష్పాలను 40 టన్నులను తెప్పిస్తామని , స్వామివారి అలంకరణకు ఉపయోగిస్తామని ఆయన పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సింఘాల్ ప్రకటించారు.బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక దర్శనాలను రద్దు చేశామని, విఐపి బ్రేక్ దర్శనాలు సైతం ప్రోటోకాల్ వున్న వ్యక్తులకు మాత్రమే పరిమితమని ఆయన తెలిపారు. తిరుపతి అర్బన్‌ ఎస్పీ పరిధిలోని 3,100 మంది పోలీసు సిబ్బంది రోజువారీ భద్రతా విధులు నిర్వర్తిస్తారని, గరుడ సేవ రోజు మాత్రం 4,200 మంది విధుల్లో ఉంటారని ఆయన పేర్కొన్నారు. ఎక్కడికక్కడ నిఘా వ్యవస్థను పటిష్టం చేశామని, తిరుమలలో అడ్వాన్స్‌ బుకింగ్‌ కోసం 2 వేల గదులు, కరెంట్‌ బుకింగ్‌ కోసం 3,200 గదులను సాధారణ సమయాల్లో కేటాయించేవారమని, అయితే బ్రహ్మోత్సవం సమయంలో భక్తుల రద్దీ దృష్ట్యా అడ్వాన్స్‌ బుకింగ్‌ గదుల సంఖ్యను 50 శాతానికి తగ్గిస్తున్నామని తెలిపారు.