Tirumala, May 31: తిరుమల తిరుపతిలో శ్రీవారి దర్శనం (Tirumala darshan) కోసం నిత్యం వేలాదిమంది భక్తులు తరలి వస్తుంటారు. అయితే భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఈ నేపథ్యంలో వృద్ధులకు, దివ్యాంగులకు టీటీడీ (TTD) శుభవార్త చెప్పింది. శ్రీనివాసుడి దర్శనం కోసం వచ్చే దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేరుగా వేంకటేశ్వరస్వామి ఉచిత దర్శనం కల్పించేందుకు చర్యలు చేపట్టింది. వృద్ధులు, దివ్యాంగుల కోసం రోజులో ఒకసారి ప్రత్యేక స్లాట్‌ను (Slots) ఏర్పాటు చేస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి స్వామి వారిని దర్శించుకునేందుకు అనుమతి ఇవ్వనుంది. ఆలయం బయట గేట్ దగ్గరి పార్కింగ్ ప్రాంతం నుంచి కౌంటర్ వరకు ప్రత్యేక ఎలక్ట్రిక్ కారు అందుబాటులో ఉంటుందని టీటీడీ తెలిపింది.
వృద్ధులు, దివ్యాంగుల స్లాట్ (Handicap Slots) సమయంలో ఇతర క్యూలు నిలిపివేస్తారని, ఎలాంటి ఇబ్బంది లేకుండా కేవలం 30 నిమిషాల్లోనే స్వామి వారిని దర్శించుకుని బయటకు రావచ్చని తెలిపారు. అలాగే స్వామివారిని దర్శనం చేసుకునే వృద్ధులు, దివ్యాంగులు రూ.20 చెల్లించి రెండు లడ్డూలను తీసుకోవచ్చని టీటీడీ పేర్కొంది. వృద్ధులకు వయసు 65 సంవత్సరాలు పూర్తై ఉండాలని తెలిపింది.
దివ్యాంగులు, ఓపెన్ హార్ట్సర్జరీ చేయించుకున్న వాళ్లు, కిడ్నీ ఫెయిల్యూర్ అయినవాళ్లు, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు, పక్షవాతం, ఆస్తమా లక్షణాలున్న వ్యక్తులు తిరుమల శ్రీవారిని ఉచితంగా దర్శించుకోవచ్చని పేర్కొన్నారు. ఒకవేళ వృద్ధులు వాళ్లకై వాళ్లే నిలువలేకపోతే ఒక వ్యక్తికి అనుమతి ఉంటుందని అన్నారు. ఐడీ ప్రూఫ్‌గా ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలని చెప్పారు.
దివ్యాంగులు తప్పనిసరిగా వారి ఐడీ కార్డుతోపాటు ఫిజికల్ ఛాలెంజ్డ్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు తీసుకురావాలని అన్నారు. వృద్ధులు, దివ్యాంగులు కాకుండా పైన తెలిపిన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు సంబంధిత సర్జన్ /స్పెషలిస్ట్ జారీచేసిన మెడికల్ సర్టిఫికెట్, ఆధార్ కార్డుతో రావాలని చెప్పారు. వయోవృద్ధులు, దివ్యాంగులు దర్శనం స్లాట్ కోసం టికెట్‌ను ఆన్‌లైన్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్‌సైట్ ద్వారా బుక్చేసుకోవాలని సూచించారు. అందుకోసం ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని అన్నారు.