Vijayawada, March 06: పులి దాడిలో చనిపోయిన వాళ్లు తెలుసు, క్రూర మృగాల దాడిలో మరణించిన వారు తెలుసు. కానీ పిల్లి కాటుతో (Cat bite) మరణించారు ఇద్దరు మహిళలు. కృష్ణా జిల్లా (Krishna district) మొవ్వ మండలం వేములమడ దళితవాడకు చెందిన విశ్రాంత కండక్టర్ సాలి భాగ్యారావు భార్య కమల, ప్రైవేట్ వైద్యుడు బొడ్డు బాబూరావు భార్య నాగమణి (Nagamani) ఇద్దర్నీ రెండు నెలల కిందట ఒక పిల్లి కరిచింది. కరిచిన వెంటనే వైద్యుల సలహా మేరకు వారిద్దరూ టీటీ ఇంజక్షన్లు (TT Injections) చేయించుకొని గాయాలు తగ్గడానికి మందులు కూడా వాడారు. కొన్నాళ్ల పాటు ఎలాంటి ఇబ్బందేమీ రాలేదు.. అంతా బాగుంది అనుకునే లోపే నాలుగు రోజుల కిందట ఇద్దరికీ ఒకేసారి అనారోగ్యం చేసింది. దీంతో భయపడ్డ కుటుంబ సభ్యులు కమలను మంగళగిరి (Mangalagiri)ఎన్‌ఆర్ఐ ఆస్పత్రిలో, నాగమణిని విజయవాడ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించారు. కమల నాలుగు రోజుల కిందట హాస్పిటల్‌లో చేరితే.. నాగమణి శుక్రవారం జాయిన్ అయ్యింది. చికిత్స పొందుతున్న వీరిద్దరూ శనివారం రోజే ప్రాణాలు విడిచారు.
నాగమణి (43) శనివారం తెల్లవారుజామున మృతి చెందగా.. కమల (64) శనివారం ఉదయం 10 గంటలకు మరణించింది. పిల్లి కరవడంతో ర్యాబిస్ (Rabies) సోకి వీరిద్దరూ మరణించారని వైద్యులు చెబుతున్నారు. వారిని కరిచిన పిల్లి కుక్కకాటుకు గురై మరణించిందన్నారు. పిల్లి, కుక్క, ఎలుక, పాము తదితరాలు కరిస్తే వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాల్లో తగిన వైద్యం చేయించుకోవాలని స్థానిక ఆరోగ్య కేంద్రం అధికారి శొంఠి శివరామకృష్ణారావు సూచించారు.