Tirumala, Sep 27: తిరుమల లడ్డూ (Tirumala Laddu) వివాదంపై ఏపీలో (AP) అధికార విపక్షాల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) తిరుమల పర్యటన తీవ్ర ఉత్కంఠ రేపుతున్నది. శుక్రవారం సాయంత్రం వైఎస్ జగన్ తిరుపతి చేరుకుంటారు. శనివారం ఉదయం 10.30 గంటలకు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. కాలి నడకన తిరుమల వెళ్లాలనుకున్నప్పటికీ.. గాయం తిరగబెట్టడంతో ఆయన రోడ్డు మార్గం ద్వారా ఏడుకొండలవారి సన్నిధికి చేరుకుంటారు. జగన్ తిరుమలకు వస్తుండటంతో వైసీపీ, కూటమి నేతలకు ముందస్తుగా నోటీసులు జారీచేస్తున్నారు. కడప, అన్నమయ్య, నెల్లూరు, చిత్తురూ జిల్లాల నుంచి వైసీపీ కార్యకర్తలు భారీగా తరలిరానున్న నేపథ్యంలో జిల్లా సరిహద్దుల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే వదిలిపెడుతున్నారు.
తిరుపతి జిల్లాలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్
జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు తిరుపతి జిల్లాలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ విధించారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. అక్టోబర్ 24వ తేదీ వరకూ జిల్లాలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ ఆంక్షలు అమలులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. పోలీసు శాఖ నుండి అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, భేటీలు, ఊరేగింపులు నిర్వహించడానికి వీలులేదని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.