Vizag vs Hyderabad: జగన్ ఒక్కసారి కమిట్ అయితే..! ఏపీకి మూడు రాజధానుల నిర్ణయాన్ని మరోసారి సమర్థించుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి, వైజాగ్ అయితేనే హైదరాబాద్‌తో పోటీపడుతుందని పునరుద్ఘాటన
Andhra Pradesh CM YS Jagan Mohan Reddy | File Photo

Vizag, February 06: ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధానిని అమరావతి నుండి విశాఖపట్నంకు మార్చాలన్న తన నిర్ణయాన్ని సమర్థిస్తూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నం అయితేనే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలతో పోటీ పడగలదనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

అమరావతిని ఒక గొప్ప రాజధానిగా అభివృద్ధి చేయటానికి రాష్ట్రానికి ఆర్థిక సామర్థ్యం లేదని పేర్కొన్న సీఎం జగన్,  రాజధాని వికేంద్రీకరణ చేయడం ద్వారా రాష్ట్రానికి ఒక తండ్రి లాగా తానేం చేయగలరో వివరించారు.

“ఒక కుటుంబ పెద్ద ఏదైతే చేస్తాడో, ఏపీ రాష్ట్రానికి ఒక తండ్రిగా అమరావతి, విశాఖపట్నం మరియు కర్నూలు నగరాలు సమవృద్ధి సాధించడానికి సామర్థ్యం మేరకు తండ్రి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాను" అని పేర్కొన్నారు.

సీఎంగా తాను తీసుకున్న ఈ మూడు రాజధానుల నిర్ణయంపై ముందుకు వెళ్లకపోతే అది భవిష్యత్ తరాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని జగన్ అన్నారు. భవిష్యత్ తరాలు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి, ఉపాధి అవకాశాలను కోరుకుంటారు. డిగ్రీ పట్టాలు పొందిన యువత ఉద్యోగావకాశాలను వెతుక్కుంటూ ఎక్కడికి వెళ్లాలి? అమరావతిని గొప్ప రాజధానిగా తీర్చిదిద్దాలంటే అందుకు సరిపడా నిధులు రాష్ట్ర ఖజానాలో లేవు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా భవిష్యత్ తరాలకు నేను జవాబుదారీగా ఉండటం కోసమే, రాజధాని వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నాం" అని ఒక జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన చర్చలో భాగంగా సీఎం జగన్ తన అభిప్రాయాలను పంచుకున్నారు.

గత ప్రభుత్వ అంచనాల ప్రకారం అమరావతి ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి సుమారు రూ.1.9 లక్షల కోట్లు అవసరమవుతాయి, ఈ మొత్తంలో 10 శాతం మాత్రమే ఖర్చు చేయడం ద్వారా విశాఖపట్నంలో అలాంటి సదుపాయాలు కల్పించవచ్చని సీఎం పేర్కొన్నారు.

అమరావతిలో ఎంత ఖర్చు చేసినా అది సముద్రంలో ఒక నీటి చుక్క మాత్రమే అవుతుంది. అయితే విశాఖపట్నం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో నంబర్ వన్ నగరంగా ఉంది, మరియు అన్ని మౌలిక సదుపాయాలను కలిగి ఉంది. అలాంటపుడు అమరావతికి ఖర్చు చేసే లక్ష కోట్ల మొత్తంలో 10 శాతం వైజాగ్‌లో ఖర్చు చేస్తే రాబోయే 5 లేదా 10 సంవత్సరాలలో ఏపీ రాజధాని హైదరాబాద్, బెంగళూరు మరియు చెన్నై నగరాలకు దీటుగా నిలుస్తుందని జగన్ ధీమా వ్యక్తం చేశారు.

అదే సమయంలో అమరావతిని విస్మరించడం లేదని, ఈ ప్రాంతం లేజిల్సేటివ్ రాజధానిగా కొనసాగుతుంది, అసెంబ్లీ ఇక్కడే ఉంటుంది అని సీఎం జగన్ స్పష్టం చేశారు.  ఈ క్రమంలో వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవుతుంది, ఇక్కడ ముఖ్యమంత్రి మరియు మంత్రుల కార్యాలయాలు, సచివాలయం ఉంటాయి, వివిధ శాఖాధిపతులు ఇక్కడ్నించి పనిచేస్తారు. ఇక రాయల్‌సీమలోని కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటుంది అని సీఎం వివరణ ఇచ్చారు.  రాజధాని ఈడా ఉంటుంది, ఆడా ఉంటుంది.. అమరావతి రైతులకు సీఎం జగన్ భరోసా

చంద్రబాబు హయాంలో రాష్ట్ర రాజధానిని ప్రకటించే ముందుగా అప్పటి సీఎం చంద్రబాబు మరియు ఆయన మిత్రులు కలిసి అమరావతి ప్రాంతంలో భారీ ఎత్తున భూములు కొనుగోలు చేశారని మరోసారి గుర్తుచేశారు.

గత ప్రభుత్వం పూల్ చేసిన 53,000 ఎకరాల భూమిలో ప్రాథమిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం కోసం, ఎకరానికి రూ .2 కోట్ల చొప్పున రూ.1.09 లక్షల కోట్లు ఖర్చు అంచనాలు చూపించారు. ఇందుకు కేంద్రం నుంచి లభించిన సహాయం రూ. 1,500 కోట్లు, గుప్పెడు వేరుశెనగలు ఇచ్చినంత అని చెప్పారు. ఇంతకు మించి ఇక కేంద్రం నుంచి వచ్చే నిధులు ఏమి ఉండవు. ఇక ఒక్క చోట లక్ష కోట్ల నిధులు సమకూర్చే సామర్ధ్యం రాష్ట్రానికి లేదు. అమరావతికి అవసరమయ్యే రూ.1.9 లక్షల కోట్ల అప్పుకు వడ్డీ కలిస్తే రూ 3-4 లక్షల కోట్ల రూపాయలు దాటుతాయి, ఆ పరిస్థితి రాకూడదనే మూడు రాజధానుల ప్రతిపాదన చేసినట్లు జగన్ పునరుద్ఘాటించారు.