Kadapa,December 23: దేశ వ్యాప్తంగా వివాదానికి కేంద్రబిందువైన జాతీయ పౌరపట్టిక (ఎన్‌ఆర్సీ) అమలుపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (Andhra Pradesh CM YS Jagan Mohan Reddy) కీలక ప్రకటన చేశారు. తమ ప్రభుత్వం ఎన్‌ఆర్సీకి (National Register of Citizens)వ్యతిరేకమని, రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తే లేదని సీఎం జగన్ ప్రకటించారు.
ఈ సందర్భంగా మైనార్టీలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలో భాగంగా సోమవారం కడప జిల్లాలో (Kadapa) పర్యటించిన సీఎం జగన్.. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎన్‌ఆర్సీ బిల్లు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ప్రభుత్వం తరఫున గతంలోనే వ్యాఖ్యలు చేశారని, ఆయన ప్రకటనకు మేము కట్టుబడి ఉంటామని సీఎం స్పష్టం చేశారు. కాగా వివాదాస్పద ఎన్‌ఆర్సీపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా మైనార్టీల నుంచి పెద్ద ఎత్తున నిరసన సెగలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముస్లిం, మైనార్టీలకు తాము అండగా ఉంటామని, ఏమాత్రం ఆందోళనకు గురికాద్దని డిప్యూటీ సీఎంతో పాటు పలువురు మంత్రులు కూడా భరోసా ఇచ్చారు.
Here's Tweet
Andhra Pradesh CM YS Jagan Mohan Reddy at a public meeting in Kadapa district, earlier today: My government is against National Register of Citizens (NRC) and will not implement it in the state. (file pic) pic.twitter.com/C8WmYgaTWX
— ANI (@ANI) December 23, 2019
నీటిపారుదల ప్రాజెక్టులకు శంకుస్థాపన
వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటించిన సీఎం పలు నీటిపారుదల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. కుందూ నదిపై మూడు ప్రాజెక్టులు నిర్మించాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించిన విషయం తెలిసిందే.దీనిలో భాగంగా దువ్వూరు మండలం నేలటూరు వద్ద సీఎం వైఎస్ జగన్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. రాయలసీమ జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు ఈ ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టినట్టు ఆయన తెలిపారు. దువ్వురు నుంచి బ్రహ్మంసాగర్ నీటి తరలింపుతో తెలుగుగంగా ఆయకట్టు స్థిరీకరణ చేస్తామని, బ్రహ్మంసాగర్ కింద 90 వేల ఎకరాలను నీరు అందించే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. ఆర్టీపీపీకి 1.4 టీఎంసీల నీటిని కేటాయిస్తామన్నారు. టీడీపీ హయాంలో ప్రాజెక్టులను ఏమాత్రం పట్టించుకోలేదని సీఎం విమర్శించారు.
కడప ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన
కడప ఉక్కు పరిశ్రమకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు అని అన్నారు. రూ.15వేల కోట్ల పెట్టుబడితో 30లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో స్టీల్ ప్లాంట్ పెట్టామని, మూడేళ్లలో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. ఉక్కు పరిశ్రమతో బతుకులు మారిపోతాయన్న జగన్.. ప్రత్యక్షంగా, పరోక్షంగా 25వేల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం బడ్జెట్ లో రూ.250 కోట్లు కేటాయించామన్నారు. ఇప్పటికే రూ.62 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉక్కు పరిశ్రమ కట్టడం రాష్ట్ర ప్రభుత్వం పని కాకపోయినా.. ఆ బాధ్యతను తీసుకున్నామని జగన్ చెప్పారు.
ఇదిలా ఉంటే కడప స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేయడం ఇది మూడోసారి. 2007లో మొదటి సారి వైఎస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 2018లో చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఇప్పుడు సీఎం జగన్ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది.