Amaravati, April 25: తెలుగు రాష్ట్రాల ప్రజలకు విశాఖ వాతావరణ కేంద్రం అలర్ట్ జారీ చేసింది. మునుపెన్నడూ లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో అనూహ్యమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపింది. ఓవైపు పగటిపూట మండే ఎండలు, మరోవైపు విపరీతమైన ఈదురు గాలులు, అకాల వర్షాలు ప్రజల్ని అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో..రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ ఈ హెచ్చరికను జారీ చేసింది.
రానున్న రోజుల్లో వాతావరణంలో తీవ్ర మార్పులు ఉంటాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రాబోయే ఐదురోజుల్లో ఓ మోస్తరు వర్షాలు ఉంటాయని, క్యుములో నింబస్ మేఘాల ప్రభావంతో కొన్ని చోట్ల కుండపోత వానలు కురుస్తాయని తెలిపింది. 40-50 కిలోమీటర్ల వేగంతో గాలిదుమారం వీస్తుందని, అలాగే క్రికెట్ బాల్ సైజ్‌లో వడగండ్ల వానకు ఆస్కారం ఉందని హెచ్చరించింది.
మరోవైపు పగటి పూట ఉష్ణోగ్రతల్లో సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ పెరుగుదల ఉండొచ్చని అంచనా వేస్తోంది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేస్తోంది. గాలి విచ్ఛిన్నం, ద్రోణుల ప్రభావంతో వాతావరణంలో ఈ తరహా మార్పులు సంభవిస్తాయని పేర్కొంది వాతావరణ కేంద్రం.