Weather Forecast: మరింతగా బలపడిన అల్పపీడనం, ఏపీలో దక్షిణ కోస్తా జిల్లాలకు మూడు రోజులు భారీ వర్ష సూచన, తీరం వెంబడి గంటకు 40–45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు
Low pressure (Photo Credits: PTI)

Vjy, Nov 11: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం మరింతగా బలపడింది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. మరోవైపు అల్పపీడన ద్రోణి మధ్య బంగాళాఖాతం నుంచి ఉపరితల ఆవర్తన ప్రాంతం వరకు కొనసాగుతోంది.

ఇది వాయవ్య దిశగా కదులుతూ 12వ తేదీ వరకు తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతాలకు విస్తరిస్తుందని భారత వాతావరణ విభాగం (IMD) గురువారం రాత్రి విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించింది. ఈ ప్రభావంతో రానున్న మూడు రోజులు (South AP coast for three days) ఉత్తర కోస్తాలో అక్కడక్కడ, దక్షిణ కోస్తాలో అనేక చోట్ల, రాయలసీమలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

అర్థరాత్రి చెన్నైని ముంచెత్తిన భారీ వరదలు, పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం, ఏపీలో మరో మూడు రోజులు భారీ వర్ష సూచన

రానున్న రెండు రోజులు దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల, ఉత్తర కోస్తాలో కొన్ని ప్రాంతాల్లోనూ మోస్తరు వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy to very heavy rain ) కురవవచ్చని వివరించింది. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు కూడా సంభవించే అవకాశం ఉందని తెలిపింది.అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడు రోజులు రాష్ట్రంలో తీరం వెంబడి గంటకు 40–45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉంటుందని తెలిపింది. తీరాల వెంబడి శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సూచించారు.