ఏపీలో మరో మూడు నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు (Andhra Pradesh Elections 2024) జరగనున్న నేపథ్యంలో అధికార పార్టీ వైసీపీ ఎన్నికల వ్యూహంలో బిజీగా ఉంది. ఇందులో భాగంగానే ఇప్పటికే మూడు జాబితాలు ప్రకటించిన జగన్ సర్కారు నాలుగో జాబితాపై కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ జాబితాపై వైవీ సుబ్బారెడ్డి (YSRCP Regional Coordinator YV Subbareddy) హింట్ ఇచ్చారు.
సీట్ల మార్పుల విషయంలో సీఎం జగన్ స్పష్టంగా ఉన్నారు. గెలుపునకు దూరంగా ఉన్న అభ్యర్దులను సీట్లు ఉండవని ముందు నుంచి చెబుతూ వస్తున్నారు.అందుకు తగ్గట్లే మార్పులతో మూడు జాబితాలు విడుదల చేశాం. కొత్త మార్పులు, చేర్పులకు సంబంధించిన ఫైనల్ లిస్ట్ పండుగ తర్వాత వస్తుంది. సిట్టింగ్‌లు కొత్త అభ్యర్థులతో అడ్జస్ట్ కావడానికి కొంత టైం పడుతుంది. సీనియర్లు వాళ్ల వ్యక్తిగత కారణాలతోనే పార్టీని వీడుతున్నారు. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయి. అల్టిమేట్ గా ట్రాక్ రికార్డును బట్టే ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు ఫైనల్ అవుతాయి అని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా కేశినేని నాని, వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్‌ల మూడో జాబితా ఇదిగో..
అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్‌ఛార్జిల మార్పు విషయంలో పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి క్లారిటీతోనే ఉన్నారని ఆయన తెలిపారు. ప్రత్యక్ష రాజకీయాల్లో గ్యాప్ రావడంతోనే పార్టీ పనులు చూసుకుంటున్నట్లు తెలిపిన వైవీ సుబ్బారెడ్డి.. తాను పోటీ చేసే విషయంలోనూ సీఎం జగన్‌దే తుది నిర్ణయమని స్పష్టం చేశారు.
ఒంగోలు లోక్‌సభకు పోటీ చేయనని సీఎం జగన్‌కు చాలాసార్లు చెప్పానని, పోటీ చేయాలనుకుంటే 2019 ఎన్నికల్లోనే పోటీ చేసేవాడిని, కంటిన్యూ అయ్యేవాడ్ని అని చెప్పుకొచ్చారాయన. ప్రత్యక్ష రాజకీయాలకు గ్యాప్ రావడంతోనే పార్టీ పనులు చూస్తున్నానని చెప్పిన వైవీ సుబ్బారెడ్డి.. అయితే అంతిమంగా పోటీ చేసే విషయంలో జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు.
ఇక బీసీలకు ప్రభుత్వం ఏమీ చేయలేదని విమర్శ సరికాదన్న ఆయన.. దేశంలో బీసీలకు అత్యదిక ప్రాధాన్యం ఇచ్చిన సీఎంగా జగన్ చరిత్ర సృష్టించారని అన్నారు. మా వల్ల మీ కుటుంబాల్లో మేలు జరిగితేనే మాకు ఓటెయ్యండని సీఎం జగన్ చెబుతున్నారని.. అంత ధైర్యంగా చెప్పే సీఎం ఈ దేశంలో ఎవరూ లేరని అన్నారాయన. అలాగే.. కాంగ్రెస్‌లో షర్మిల చేరికతో వైఎస్సార్‌సీపీకి ఎలాంటి నష్టం లేదని, ఆమెను దృష్టిలో పెట్టుకుని మార్పులు చేసేదేమీ లేదని వైవీ సుబ్బారెడ్డి స్పష్టత ఇచ్చారు.