Amaravathi, November 6: వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి (Nandamuri Lakshmi Parvathi ) కి కీలక పదవి దక్కింది. తెలుగు అకాడమీ (Telugu Academy) చైర్‌పర్సన్‌గా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan) నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు వెలువరించింది. 2000వ సంవత్సరంలో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి తెలుగు సాహిత్యంలో లక్ష్మీ పార్వతి ఎం.ఎ పట్టాను అందుకున్నారు.
దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు సతీమణి అయిన లక్ష్మీ పార్వతి, ఆ కాలంలో టీడీపీలో కీలకంగా వ్యవహరించే వారు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, ఏపీ మాజీ సీఎం, ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు టీడీపీ పగ్గాలు స్వీకరించిన తర్వాత ఆమె టీడీపీకి దూరమయి, సొంతంగా పార్టీ పెట్టారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా విమర్శలు చేస్తూ, ఆయన హయాంలో జరిగిన తప్పులపై ఎప్పటికప్పుడు నిలదీసేవారు. ఆ తరువాత, వారు క్రియాశీల రాజకీయాలకు కొన్ని సంవత్సరాల దూరంలో ఉన్నారు. అనంతరం వైసీపీలో చేరారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఆయన వెంట నడిచారు. గత అసెంబ్లె ఎన్నికల తర్వాత జగన్ అధికారంలోకి వచ్చాక ఆమెకు ఏదైనా కీలక పదవి ఇస్తారని అందరూ భావించారు. ఎట్టకేలకు నేడు ఆమెకు తెలుగు అకాడమీ చైర్‌పర్సన్ పదవి దక్కింది.