YS Vivekananda Reddy (Photo-ANI)

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో డ్రైవర్ దస్తగిరి సంచలన స్టేట్ మెంట్ వెలుగులోకి వచ్చింది. కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో బడా బాబుల పేర్లను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. వివేకా హత్య జరిగిన తీరును వివరిస్తూ కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు డ్రైవర్ దస్తగిరి. స్టేట్‌మెంట్‌లో వైసీపీ నేత పేరు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ప్రొద్దుటూరు కోర్టులో ఆగస్టులో స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. హత్యలో నలుగురు పాల్గొన్నట్టు కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో ఉంది.

ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, గుజ్జుల ఉమాశంకర్‌రెడ్డితో కలిసి వివేకాను హత్య చేసినట్టు దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. వివేకా హత్యకు ఎర్ర గంగిరెడ్డి ప్లాన్ చేసినట్టు కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. బెంగళూరు భూ వివాదంలో వాటా ఇవ్వకపోవడంపై ఆగ్రహంతో ఎర్ర గంగిరెడ్డి రగిలిపోయినట్లు చెబుతున్నారు.

అంతేకాదు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మోసం చేయడంతో ఎర్ర గంగిరెడ్డి, గుజ్జుల జగదీశ్వర్‌రెడ్డిని ఆఫీసుకు పిలిపించి తిట్టినట్టు కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో వెల్లడించారు. తర్వాత కొన్ని రోజుల పాటు వైఎస్ వివేకా, గంగిరెడ్డి మధ్య మాటలు బంద్ అయ్యాయని తెలిపారు. కోటి రూపాయిలు ఇస్తాం.. వివేకాను హత్యచేయాలని, గంగిరెడ్డి ఆఫర్ చేసినట్టు కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో దస్తగిరి వెల్లడించారు. మొత్తం హత్యకు 40 కోట్ల రూపాయిల సుపారీ ఇచ్చినట్లు తెలిపారు. సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డిలతో కలిసి తాను వివేకా ఇంటి కాంపౌండ్ దూకి లోపలికి వెళ్లినట్టు దస్తగిరి పేర్కొన్నారు. అప్పటికే ఇంట్లో ఉన్న ఎర్ర గంగిరెడ్డి తలుపు తీయడంతో లోపలికి వెళ్లినట్టు దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు.

తమను చూసిన వివేకా ఈ సమయంలో వీళ్లెందుకు వచ్చారని నిర్ఘాంతపోయారని, తర్వాత వివేకా బెడ్‌రూమ్‌లోకి వెళ్లడంతో అతని వెనుకే గంగిరెడ్డి కూడా వెళ్లాడని దస్తగిరి స్టేట్‌మెంట్ ఇచ్చారు. వివేకా బెడ్‌రూమ్‌లో డబ్బు గురించి తీవ్ర వాగ్వాదం జరిగిందని, వివేకాను బూతులు తిడుతూ మొహంపై సునీల్ యాదవ్ దాడిచేసినట్టు వెల్లడించారు. తన చేతిలోని గొడ్డలితో సునీల్ యాదవ్ వివేకాపై దాడిచేశాడని వెంటనే వివేకా కింద పడిపోవడంతో అతని ఛాతిపై 7, 8 సార్లు సునీల్ యాదవ్ బలంగా కొట్టినట్టు దస్తగిరి వెల్లడించారు.