CM YS Jagan reviews on Clean AP program (Photo-Twitter/AP CMO)

AP Municipal Elections Result: ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్రతిహత విజయాలు నమోదు చేసింది. తాజాగా నెల్లూరు కార్పొరేషన్‌ కు.. కుప్పం సహా 13 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలతో పాటు, మరో 10 మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న డివిజన్లు, వార్డులకు జరిగిన ఎన్నికల ఫలితాలు నేడు ప్రకటించారు. కేవలం రెండు మున్సిపాలిటీలు మినహా అన్నింటి వైసీపీ వన్ సైడ్ విక్టరీ సాధించింది. ముఖ్యంగా ఎంతో ఉత్కంఠ రేపిన కుప్పం మున్సిపాలిటీని కూడా వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. టీడీపీ అధినేత సొంత నియోజకవర్గంలో వైసీపీ గెలుపు సాధించడం టీడీపీకి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. చంద్రబాబుకు కంచుకోటగా గుర్తింపు పొందిన కుప్పం ఫలితం ద్వారా తమకు తిరుగులేదని వైసీపీ నిరూపించింది.25 వార్డులకు గాను వైసీపీ 19 వార్డుల్లో విజయం సాధించింది.

నెల్లూరు కార్పొరేషన్ ఫలితాల విషయానికి వస్తే మొత్తం కార్పొరేషన్ లో 54 స్థానాలు ఉంటే.. అందులో 8 ఏక గ్రీవం అయ్యాయి. మిగిలిన చోట్ల కూడా వైసీపీదే విజయం అయ్యింది. మొత్తం కార్పొరేషన్ ను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ ఫలితాలపై సీఎం జగన్ సైతం స్పందిస్తూ ట్వీట్ చేశారు..

దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు... ఇవే ఈ రోజు ఇంతటి ఘన విజయాన్ని అందించాయి అన్నారు సీఎం జగన్. గ్రామంతో పాటు నగరం కూడా పనిచేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలిచింది అన్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో 100కు 97 మార్కులు వచ్చాయి అన్నారు. వైసీపిని ఇంతలా ఆదరిస్తున్న అవ్వాతాతలు, అక్కాచెల్లెళ్ళు, సోదరులందరికీ సీఎం జగన్ ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేశారు.

ఇదిలా ఉంటే తాజా ఎన్నికలతో టీడీపీ పతనం అవుతోందని వైఎస్సార్‌సీపీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబు రాజకీయ జీవితానికి తెరపడిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇక పూర్తిగా విశాంత్రి తీసుకోవచ్చన్నారు. ప్రజల తీర్పును వినయంగా, విధేయంగా స్వీకరిస్తున్నామని అన్నారు మంత్రి అవంతి శ్రీనివాస్. ఈ విజయం తమపై మరింత బాధ్యతను పెంచిందన్నారు. ప్రజలు ఒక నమ్మకం, విశ్వాసంతో ఈ తీర్పును ఇచ్చారని అన్నారు. ఎక్కడా ఎలాంటి వివక్ష లేకుండా తమ నాయకుడు సీఎం జగన్‌ పరిపాలన అందిస్తున్నారని తెలిపారు. ఎవరైతే 2019లో తమకు ఓట్లు వేయలేదో వాళ్లు కూడా తమ పరిపాలన చూసి ఇప్పుడు ఓట్లు వేశారని చెప్పుకొచ్చారు అవంతి. ఇక మంత్రి అనిల్ సైతం నెల్లూరు కార్పొరేషన్‌లోని 54 డివిజన్లలో వైఎస్సార్‌సీపీ అభ్యుర్థులను గెలిపించిన ప్రజలకు మంత్రి అనిల్‌కుమార్‌ ధన్యవాదాలు తెలిపారు.