YSRCP Plenary 2022 (Photo-Twitter)

Guntur, July 7: నాగార్జున యూనివర్శిటీకి ఎదురుగా రేపు, ఎల్లుండి నిర్వహించనున్న వైఎస్సార్‌సీపీ ప్లీనరీకి (YSRCP Plenary 2022) సర్వం సిద్ధం అయింది. ఈ ప్లీనరీ సమావేశాలు రెండు రోజుల పాటు కొనసాగనున్నాయి. వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని నియమించే తీర్మానంతో పాటు పలు రాజకీయ తీర్మానాలను ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు.

రానున్న అసెంబ్లీ ఎన్నికలకు మార్గదర్శనం చేసే పలు అంశాలపై లోతుగా చర్చించనున్నట్లు సమాచారం. తొలిరోజు పార్టీ ప్రతినిధులతో సమావేశం ఉంటుందని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. సీఎం జగన్‌ పార్టీ జెండా ఎగురవేసి ప్లీనరీ ప్రారంభిస్తారని.. తొలిరోజు 9 రాజకీయ అంశాలపై తీర్మానాలున్నాయని వెల్లడించారు. మూడేళ్లలో ఏం చేశాం.. రెండేళ్లలో ఏం చేయబోతున్నామో చెబుతామన్నారు.

ప్లీనరీ (YSRCP Plenary 2022 in Guntur) ప్రాంగణాన్ని మంత్రులు గురువారం పరిశీలించారు. ఈ రోజు సాయంత్రానికి నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లకు పాస్‌లు పంపిణీ చేయనున్నారు. ప్లీనరీకి వచ్చే ప్రతినిధులకు భోజన, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి రోజున వైసీపీ ప్లీనరీ సమావేశం (YSRCP Plenary 2022 Meeting) శుక్రవారం ఉదయం 8 గంటలకు కార్యకర్తల రిజిస్ట్రేషన్‌తో ప్రారంభమవుతుంది.

రసాయనాలతో కూడిన ఆహారం వల్ల ఎన్నో రకాల క్యాన్సర్లు, ప్రకృతి వ్యవసాయమే మంచిది, న్యూటెక్‌ బయోసైన్సెస్‌కు శంకుస్థాపన చేసిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడేండ్లకు ఈ ప్లీనరీని నిర్వహిస్తున్నారు. ఈ ప్లీనరీలో పలు తీర్మానాలు, పార్టీ రాజ్యాంగ సవరణపై కసరత్తులు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తున్నది. ఈ ప్లీనరీ (YSRCP Plenary ) వేదిక నుంచి పార్టీ తీసుకునే కీలక నిర్ణయాలను వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడు రాజధానుల విషయంలో లోతుగా చర్చించి.. పార్టీ అభిప్రాయాన్ని మరోసారి స్పష్టం చేసేందుకు నడుం బిగించినట్లు తెలుస్తున్నది.

ఇప్పటివరకు ప్లీనరీలో పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకునే ఆనవాయితీ ఉండగా.. ఇప్పుడు పార్టీ రాజ్యాంగానికి సవరణలు తీసుకొచ్చి పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉండేలా తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. 12 సంవత్సరాలుగా జగన్ వైసీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇందులో తొమ్మిది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ఈ ప్లీనరీ జరగనుంది. 2017లో వైసీపీ ప్లీనరీ జరిగింది. మరోవైపు రేపు దాదాపు 1.50 లక్షల మంది ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ప్లీనరీకి హాజరయ్యే అవకాశముందని తెలుస్తున్నది. వీరి కోసం ఘుమఘుమలాడే వంటకాలను సిద్ధం చేస్తున్నారు.

టూరిజం స్పాట్‌గా ఏపీ, 4 ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలను.. ప్రధాన పర్యావరణ-పర్యాటక కేంద్రాలుగా మార్చే దిశగా జగన్ ప్రభుత్వం అడుగులు

శుక్రవారం ఉదయం 10.30 గంటలకు దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి సీఎం జగన్‌ నివాళులర్పిస్తారు. అనంతరం సర్వమత ప్రార్థనలు ఉంటాయి. 10.55 గంటలకు పార్టీ అధ్యక్ష ఎన్నికల ప్రకటన విడుదల చేస్తారు. ఉదయం 11 గంటలకు పార్టీ అధ్యక్ష హోదాలో సీఎం జగన్‌ ప్రసంగిస్తారు. అనంతరం పార్టీ జమాఖర్చుల నివేదికను సభ ముందుంచుతారు. ఆ తర్వాత పార్టీ నియమావళికి సవరణలు చేసే ప్రతిపాదనలను ఆమోదిస్తారు. ఉదయం 11.45 గంటలకు మహిళా సాధికారత చట్టంపై చర్చ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 2.15 గంటలకు పావు గంట సేపు సాంస్కృతిక కార్యక్రమాలుంటాయి. మధ్యాహ్నం 2.30 గంటలకు డైరెక్ట్‌ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్‌పై తీర్మానం ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

విజయమ్మ ఈ ప్లీనరీకి వస్తారో, రారో అని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారంటూ టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు ఆయన బదులిచ్చారు. ప్లీనరీ సమావేశాలకు వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ వస్తున్నారని స్పష్టం చేశారు. వైసీపీ ప్లీనరీకి స్పెషల్ గెస్టులుగా ఎవరినీ పిలవడంలేదని తెలిపారు. ప్లీనరీలో పార్టీ పరమైన తీర్మానాలు, పలు అభివృద్ధి పథకాలపై తీర్మానాలకు ఆమోదం తెలుపుతామని వెల్లడించారు. తమ ప్రభుత్వ పథకాలను, ఇప్పటివరకు చేసిన, ఇకపై చేయబోయే మంచిని కూడా ఈ ప్లీనరీ ద్వారా ప్రజలకు వివరిస్తామని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.