Rainfall. (Photo Credits: PTI)

Hyderabad, July 5: గత కొన్నిరోజులుగా మందిగించిన నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుగ్గా కదులుతున్నాయని భారత వాతావరణశాఖ తెలిపింది. దక్కన్ పీఠభూమి మీదుగా 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. దీని ప్రభావంతో రాగల రెండు రోజుల వరకు తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హైదరాబాద్ కేంద్రం తెలిపింది.

హైదరాబాద్ సహా సిద్దిపేట, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో సోమ మరియు మంగళవారాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. మహబూబ్ నగర్ మరియు ఇతర దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కురిసే వర్షాలకు ఉరుములు మెరుపులు తోడై పిడుగులుపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఆదివారం పలుచోట్ల కురిసిన వర్షానికి వాతావరణం వేడిగా మారింది. గాలిలో తేమ పెరిగి ఉక్కపోత ఎక్కువైంది. అలాగే గడిచిన ఒక్కరోజులో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1-4 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ నమోదయ్యాయి. అత్యధిక ఉష్ణోగ్రత 37.1 డిగ్రీల సెల్సియస్ ఆదిలాబాద్‌లో నమోదైంది.  సోమవారం కూడా  రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 34-37 డిగ్రీల సెల్సియస్ పరిధిలో ఉండగా, కనిష్ట ఉష్ణోగ్రతలు 24-26 డిగ్రీల సెల్సియస్ పరిధిలో ఉండనున్నాయి.

జూన్ 1న రుతుపవనాల ప్రారంభం నుండి ఇప్పటి వరకు తెలంగాణలో సాధారణ వర్షపాతం కంటే 51 శాతం అధికంగా 232.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ఇక, ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, అరేబియా సముద్రం మీదుగా నైరుతి గాలులు వీస్తుండటంతో రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఫలితంగా రాష్ట్రంలో శనివారం నుంచి తీరప్రాంతాల్లో తేలికపాటి నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే నాలుగు రోజుల వరకు ఏపి వ్యాప్తంగా అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలకు ఆస్కారం ఉందని అమరావతి వాతావరణ శాఖ డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. వాతావరణ మార్పుల వల్ల సముద్ర తీరం కూడా అల్లకల్లోలంగా ఉంటుందని తెలిపారు.

నైరుతి రుతుపవనాల ప్రభావంతో జూలై నెలలో 94 నుండి 106 శాతం వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని IMD అంచనా వేసింది. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు మరియు వాతావరణ పరిస్థితులు ఆధారంగా తాజా పరిస్థితులను అంచనావేసినట్లు ఐఎండీ తెలిపింది.