New Delhi, June 4: గురువారం కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు శుక్రవారం నాటికి మరింత విస్తరించి దక్షిణ భారతదేశంలోని మిగిలిన రాష్ట్రాల వైపుకు కదిలాయాని భారత వాతావరణ శాఖ ధృవీకరించింది. ఐఎండీ తాజా బులెటిన్ ప్రకారం నైరుతి రుతుపవనాలు మరింత బలపడి శుక్రవారం నాటికి కేరళ రాష్ట్రవ్యాప్తంగా, దక్షిణ అరేబియా భూభాగాలు, లక్షద్వీప్ దీవులు, దక్షిణ కర్ణాటక ఇంటిరీయర్ మరియు కర్ణాటకలోని చాలా తీరప్రాంతాలు అలాగే ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని తెలిపింది. ఇప్పటికే కర్వార్, అనంతపూర్, ఆరోగ్యవరం, వేలూర్, నాగపట్నం పరిసర ప్రదేశాల మీదుగా రుతుపవనాలు ఆవరించాయని పేర్కొంది.
ఇవి ఇలాగే చురుగ్గా కదులుతూ రాబోయే 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లోని మిగిలిన ప్రాంతాలు, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, మధ్య అరేబియా సముద్రం, మహారాష్ట్ర మరియు గోవాలోని కొన్ని భాగాలకు విస్తరిస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
రుతుపవనాల ప్రభావంతో రాగల 24 గంటల్లో కర్ణాటక, కేరళ, తమిళనాడులలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం, 30 కిలోమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంచి వర్షపాతం నమోదు కావొచ్చని ఐఎండీ పేర్కొంది.
భారతదేశం ఇప్పటికీ వ్యవసాయం మరియు అనుబంధ కార్యకలాపాలపై ఎక్కువగా ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థపై రుతుపవనాలు ప్రభావం ఎంతో కీలకమైనది. అయితే ఈ సీజన్ లో మంచి దేశంలో వర్షపాతం ఆశాజనకంగా ఉండబోతుందని ఐఎండీ ఇదివరకే వెల్లడించింది.