CM Revanth Reddy speech in AI Global Summit 2024 (Photo-X/CMO Telangana)

Hyd, Sep 5: హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో రాష్ట్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘గ్లోబల్‌ ఏఐ’ సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్‌లో జీపీయూ ఆధారిత ఏఐ క్లౌడ్‌ ఏర్పాటులో భాగస్వామ్యంలో సదస్సులో (AI Global Summit 2024) చర్చించారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ.. సరికొత్త ఆవిష్కరణలు ప్రపంచాన్ని మార్చాయని అన్నారు. నేటి తరం అద్భుత ఆవిష్కరణ ఏఐ అని కొనియాడారు.

కొత్త ఆవిష్కరణలు ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తాయి. అవి ఆశలతో పాటు భయాన్నీ తీసుకొస్తాయి. విప్లవాత్మక మార్పులకు హైదరాబాద్‌ మాదిరిగా ఏ నగరమూ సిద్ధంగా లేదు. ఏఐ ద్వారా భవిష్యత్తుకు బలమైన పునాది వేశాం. నాస్కామ్ సహకారంతో ఏఐ ఫ్రేమ్‌ వర్క్‌కు రూపకల్పన జరుగుతుంది. ఆవిష్కరణలకు పారిశ్రామిక నిపుణులతో రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తోంది. అందరం కలిసికట్టుగా సరికొత్త భవిష్యత్తును ఆవిష్కరిద్దాం’’అని రేవంత్ అన్నారు.  ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచితంగా విద్యుత్‌ సరఫరా, కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం, విద్యా వ్యవస్థ ఇంకా మారాల్సి ఉందని తెలిపిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఏఐ ఆధారిత రంగాల్లోని నిపుణులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. రైల్ ఇంజిన్, ఫోటో కెమెరా మొదలు కొని ఇప్పుడు ఏఐ టెక్నాలజీలో అడుగుపెట్టాం. క్రమంగా టెక్నాలజీ పెరుగుతోంది. ఎన్నికల ముందు డిక్లరేషన్‌లో చెప్పినట్టే ఏఐకి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఏఐతో పాటు ఇతర టెక్నాలజీల్లో నిష్ణాతులైన నిపుణులకు అవకాశాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా అందరికి అవకాశం ఇస్తున్నాం’ అని రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

ఐటీ రంగంలో ప్రపంచంలో అందరి దృష్టిని ఆకర్షించేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈసదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో నిర్మించనున్న ఫోర్త్ సిటీలో 200 ఎకరాల విస్తీర్ణంలో ప్రతిష్టాత్మకంగా ఏఐ సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని అన్నారు. ఇంటర్నేషనల్ ఏఐ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రపంచ దేశాలకు చెందిన జాతీయ, అంతర్జాతీయ టెక్నాలజీ కంపెనీ ప్రతినిధులు హాజరయ్యారు. ప్రతి ఒక్కరికీ కృత్రిమ మేథస్సుని అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏఐ సదస్సును నేడు, రేపు హైదరాబాద్‌ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహిస్తోంది.