Hyderabad, May 14: తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా మరో 41 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం COVID-19 కేసుల సంఖ్య 1367కు చేరింది. నిన్న నమోదైన మొత్తం కేసుల్లో 31 కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనివి కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 10 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. బుధవారం మరో రెండు కరోనా మరణాలు నమోదయ్యాయి. మృతులు ఇద్దరూ కూడా హైదరాబాద్ వాసులే. వీరిద్దరికి ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. వీరితో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 34కు పెరిగింది.
అయితే కోవిడ్-19 నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా మెరుగ్గానే ఉంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 69 శాతం బాధితులు కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే భారీగా 117 మంది కోవిడ్-19 బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 939 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 394 యాక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Telangana's #COVID19 Report
లాక్డౌన్ సడలింపులతో మరింత అప్రమత్తత అవసరం: మంత్రి ఈటల
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తి అడ్డుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంధర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన నేపధ్యంలో రాష్ట్రంలోకి పెద్ద ఎత్తున వలస కార్మికులు, ప్రయాణీకులు వస్తున్నారు కాబట్టి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి తెలిపారు.
"మొదట విదేశాలనుండి వచ్చిన వారివల్ల, తరువాత మర్కజ్ తో వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరిగింది, ఇప్పుడు మైగ్రంట్స్ వల్ల ఆ ప్రమాదం ఉంది" అని మంత్రి అభిప్రాయపడ్డారు.
విదేశాల నుండి విమానాల ద్వారా వస్తున్న ప్రయాణీకులను హోటల్స్ లో క్వారెంటెన్ లో ఉంచుతున్నామన్నారు. రైళ్ల ద్వారా వచ్చిన వారికి ప్రతి రైల్వే స్టేషన్ లో వైద్య సిబ్బంది జ్వర పరీక్షలు చేసి హోమ్ క్వారెంటైన్ ముద్ర ను చేతి మీద వేసి పంపిస్తున్నారు. రోడ్డు మార్గంలో వచ్చిన వారికి రాష్ట్ర సరిహద్దుల్లోనే వైద్య బృందాలు పరీక్షలు చేసి 14 రోజుల పాటు హోమ్ క్వారెంటైన్ లో ఉంచుతున్నారు. ప్రతి గ్రామం లోకి బయటినుంచి వచ్చిన వారిని గుర్తించి, పరీక్షలు చేసి, 14 రోజులు బయటికి వెళ్లకుండా ఆశా వర్కర్లు పర్యవేక్షణ చేస్తున్నారు. లక్షణాలు ఉన్నవారిని వెంటనే హాస్పిటల్స్ కి తరలించి పరీక్షలు చేస్తున్నాం. ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం క్వారెంటెన్ చేస్తున్నామన్నామని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. స్పాట్ వాల్యూయేషన్‌కు తెలంగాణ హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్, మరో 20 రోజుల్లో ఇంటర్ ఫలితాలు
ఇప్పటి వరకు విమానాల్లో 798 మంది, రైళ్లలో 239 మంది, రోడ్డు మార్గం ద్వారా 41,805 మంది రాష్ట్రానికి వచ్చారు. లాక్ డౌన్ సడలింపు వల్ల ఎక్కువమంది బయటికి వస్తున్న నేపధ్యంలో మరింత జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు మంత్రి పిలుపు ఇచ్చారు. భౌతిక దూరం పాటించాలని, మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలని, తరుచుగా చేతులు కడుక్కోవాలి అని కోరారు. ప్రభుత్వం ఎంత చేసినా, ప్రజల భాగస్వామ్యం తోనే కరోనా కట్టడి సాధ్యం అవుతుంది అన్నారు. ఇప్పటి వరకు ప్రజల మద్దతు ఇచ్చారు, ఇక ముందు కూడా ప్రభుత్వం ఇస్తున్న మార్గ నిర్దేశకాలను పాటించి సహకారం అందించాలని కోరారు.
గాంధీ ఆసుపత్రి వైద్యులు అందిస్తున్న వైద్య సేవలు మరువలేనివి అని మరోసారి మంత్రి కొనియాడారు. డిశ్చార్జ్ అయి వెళ్తున్న ప్రతి పేషంట్ సంతృప్తికరంగా వెళ్తున్నారని అన్నారు. అంతేకాదు చికిత్స పొందుతున్న వారికి ప్లాస్మా థెరపీ ద్వారా నయం చేయడానికి అవసరం అయిన ప్లాస్మా కూడా ఇవ్వడానికి ముందుకు రావడం సంతోషం అని మంత్రి అన్నారు.ఈ రోజు గాంధీ వైద్యులు కరోనా పాజిటివ్ ఉన్న మరో గర్భిణి స్త్రీ కి డెలివరీ చేశారు. డాక్టర్ షర్మిల, డాక్టర్ రాణి డెలివరీ చేశారనీ మంత్రి తెలిపారు. IMR ఇన్ఫాంట్ మోర్టలిటీ రేట్ గణనీయంగా తగ్గడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. 2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు IMR 39 ఉండగా, ఇప్పుడు 27కి తగ్గింది అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వే ఇది స్పష్టం చేసింది అన్నారు. ఇందుకోసం కష్టపడుతున్న ఆరోగ్య శాఖ లోని ప్రతి ఒక్కరికీ మంత్రి అభినందనలు తెలిపారు. KCR Kits వచ్చిన తరువాత చాలా మంది డెలివరీ కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్నారు అని, దీనివల్ల తల్లి, బిడ్డలు క్షేమంగా ఇంటికి వెళ్తున్నారు అని మంత్రి అన్నారు.