Hyderabad, May 15: తన అబద్ధాలతో తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై (Amith Shah) హరీశ్‌రావు (Harish Rao) ధ్వజమెత్తారు. నిన్న ఆయన చెప్పివన్నీ అసత్యాలేనని హరీశ్‌రావు స్పష్టం చేశారు. అమిత్ షా చెప్పిన అబద్ధాలపై స్థానిక బీజేపీ నాయకులకు దమ్ము, ధైర్యం ఉంటే తాను అడుగుతన్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. అమిత్ షా బహిరంగంగా మాట్లాడిన అబద్ధాలు ఇవే అని హరీశ్‌రావు తెలిపారు. అమిత్ షా.. అబద్ధాల షా (Liar) అని తీవ్ర విమర్శలు చేశారు. అన్ని పథకాలకు కేంద్రం ప్రభుత్వం నిధులు ఇస్తుందనడం హాస్యాస్పదమన్నారు. నిధులు ఎక్కడ ఇచ్చారో చూపించాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రులు ఒక్కొక్కరూ పొంతన లేకుండా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. కాళేశ్వరంతో రాష్ట్రం సస్యశ్యామలమైందని గడ్కరీ (Gadkari) చెబితే.. లాభం లేదని అమిత్‌షా చెప్పడం ఆంత్యరమేంటని ప్రశ్నించారు.
అబద్ధం నంబర్ 1 : మజ్లిస్ పార్టీకి భయపడి టీఆర్ఎస్ పార్టీ 370 ఆర్టికల్‌కు మద్దతు ఇవ్వలేదని అమిత్ షా అన్నారు. అసలు అమిత్ షాకు అల్జీమర్స్ వ్యాధి ఏమైనా ఉందా? అని అనుమానం వస్తోందని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దుకు టీఆర్ఎస్ పార్టీ బహిరంగంగా మద్దతు తెలిపింది. పార్లమెంట్లో నిర్వహించిన ఓటింగ్‌లో కూడా పాల్గొన్నది. మజ్లిస్ పార్టీకి భయపడి ఆర్టికల్ 370ని వ్యతిరేకించిందని అమిత్ షా పచ్చి అబద్ధం మాట్లాడారు. దీనిపై రాష్ట్ర బీజేపీ నేతలు స్పందించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
అబద్ధం నంబర్ 2 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్ భగీరథకు రూ. 2500 కోట్లు ఇచ్చామని అమిత్ షా చెప్పారు. ఇది కూడా పచ్చి అబద్ధం. ఈ పథకానికి కేంద్రం రూ. 2 కూడా ఇవ్వలేదు. మిషన్ భగీరథకు రూ. 2 ఇచ్చి ఉంటే ఆధారాలు చూపించాలని రాష్ట్ర బీజేపీ నేతలను డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే రూ. 35 వేల 200 కోట్లు ఖర్చు పెట్టి ఈ పథకాన్ని అమలు చేస్తుందని హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఈ పథకం అమలుతో రాష్ట్రం ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా మార్చామని తెలిపారు.
అబద్ధం నంబర్ 3 : ఆయుష్మాన్ భారత్ తెలంగాణలో అమలు కావడం లేదని అమిత్ షా పచ్చి అబద్ధం మాట్లాడారు. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ అమలవుతుందని పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి చెప్పారని హరీశ్‌రావు గుర్తు చేశారు. ఆయుష్మాన్ భారత్ తెలంగాణలో అమలవుతుందా? అని 2022, ఫిబ్రవరి 4 న ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి సమాధానం చెప్పారు. 2021, మే 21 నుంచి ఆయుష్మాన్ భారత్ తెలంగాణలో అమలవుతోందని కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. ఒక వేళ తెలంగాణలో ఈ పథకం అమలు కాకపోతే రూ. 150 కోట్లు కేంద్రం ఎలా ఇస్తుందని అమిత్ షాను హరీశ్‌రావు ప్రశ్నించారు. ఈ అంశంపై అమిత్ షా అడ్డంగా అబద్ధాలు ఆడిండని నిప్పులు చెరిగారు.
అబద్ధం నంబర్ 4 : సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు చేయలేదని అమిత్ షా అన్నారు. కేసీఆర్ స్వయంగా హైదరాబాద్ నలుమూలలా నాలుగు ఆస్పత్రులను పెట్టాలని నిర్ణయించారని హరీశ్‌రావు తెలిపారు. ఇప్పటికే గచ్చిబౌలిలో టిమ్స్ నడుస్తోంది. మరో మూడు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు ఇటీవలే శంకుస్థాపన చేశారు. దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే ఒక్కటి కూడా తెలంగాణకు ఇవ్వలేదు. మీరు ఏం ఇవ్వకపోయినా 33 జిల్లాల్లో 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆయా జిల్లాల్లో మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయని హరీశ్‌రావు తెలిపారు.
అబద్ధం నంబర్ 5 : కొన్ని పథకాలకు పేర్లు మార్చి కేంద్రం డబ్బులు వాడుకుంటున్నారని అమిత్ షా అన్నారు. మన ఊరు – మన బడి సర్వశిక్షా అభియాన్ లోనే వచ్చిందట. మేమే మాపైసలు ఇస్తున్నాం అని అమిత్ షా అంటున్నారు. మన ఊరు – మన బడి పథకం అమలు కోసం రూ. 7,300 కోట్లు ఖర్చు పెడుతున్నామని హరీశ్‌రావు తెలిపారు. సర్వశిక్షా అభియాన్ కింద కేవలం రూ. 300 కోట్లు ఇస్తున్నారు. మన ఊరు – మన బడి పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వమే రూ. 7,000 కోట్లు సమకూర్చుతుందన్నారు. అసలు ఈ పథకం ఉద్దేశం తెలుసా? అని హరీశ్‌రావు అమిత్ షాను ప్రశ్నించారు.
అబద్ధం నంబర్ 6 : నరేగా నిధుల కేటాయింపులపై అర్ధ గంటలోనే ఇద్దరు కేంద్ర మంత్రులు పచ్చి అబద్ధాలు ఆడారు. ముందుగా మాట్లాడిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నరేగాకు రూ. 30 వేల కోట్లు ఇచ్చామన్నారు. అర్ధ గంట తర్వాత మాట్లాడిన అమిత్ షానేమో రూ. 18 వేల కోట్లు ఇచ్చామన్నారు. ఇందులో ఏ కేంద్ర మంత్రిది నిజం. ఇద్దరిలో ఎవర్నీ నమ్మాలి. కిషన్ రెడ్డి మాట నిజమా? అమిత్ షా మాట నిజమా? నిన్న అమిత్ షా అబద్ధాల పురాణం చదివారని హరీశ్‌రావు మండిపడ్డారు.