Hyderabad November 17: ఫారెస్ట్ లవర్స్‌కు అటవీశాఖ అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది. సఫారీ అంటే ఆఫ్రికాలో మాత్రమే అందుబాటులో ఉంటుందని ఇప్పటివరకు మనకు ఉన్న అపోహను తొలగిస్తూ, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో టైగర్ సఫారీని అందుబాటులోకి తెచ్చింది. పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, అడవి కుక్కలు, నక్కలు, చుక్కల జింకలు, సాంబార్ జింకలు, నీల్గాయి, చింకారా, బ్లాక్‌బక్, మూషిక జింకలు, నాలుగు కొమ్ముల జింకలు, అడవి పందులు.. తదితర 19 రకాల జంతువులు, 300 రకాల అరుదైన పక్షులు.. ఇవన్నీ మన తెలంగాణలోనే చూసే అవకాశం వచ్చింది.
హైదరాబాద్‌కు కేవలం 140 కిలోమీటర్ల దూరంలోని ప్రకృతి రమణీయ నల్లమల అడవిలో ఉన్న అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో వీటన్నింటినీ వీక్షించే అవకాశాన్ని కల్పించింది అటవీశాఖ.
టైగర్ సఫారీలో భాగంగా ఫరహాబాద్ గేటు నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరం దట్టమైన అడవిలో సఫారీ ఏర్పాటు చేశారు. ఇద్దరు పర్యాటకులు రూ.4,600తో ఒకరోజు ఉండేందుకు కాటేజీతో పాటు టైగర్ సఫారీ, మరుసటి రోజు మన్ననూరు నుంచి ఉమామహేశ్వర ఆలయం వరకు 5 కిలోమీటర్లు ట్రెక్కింగ్ ఈ టూర్‌లో భాగం. ఆహ్లాదాన్ని పంచే అడవిలో పక్షులు, జంతువుల మధ్య ఆనందంగా గడపవచ్చు. అడవి మధ్యలో నివసించే చెంచుల జీవన విధానం తెలుసుకోవచ్చు.
పర్యావరణ పరిరక్షణ, పులులను రక్షించుకోవాల్సిన అవసరాన్ని, జంతుజాలం, పక్షుల గురించి తెలుసుకునేలా ఈ ట్రిప్‌ను రూపొందించారు. అమ్రాబాద్ టైగర్ రిజర్ ఫీల్డ్ డైరెక్టర్, సీసీఎఫ్‌బీ శ్రీనివాస్ తెలిపారు. టూర్ కోసం amrabadtigerreserve.comలో బుక్ చేసుకోవచ్చు.
దాదాపు 2,611 కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించిన అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ నాగర్‌కర్నూల్, నల్లగొండ జిల్లాల్లో విస్తరించి ఉన్నది. కోర్ ఏరియాను పరిగణలోకి తీసుకొంటే ఇది దేశంలోనే రెండో అతిపెద్ద టైగర్ రిజర్వ్. 1983లో దీనిని శాంక్చురీగా ప్రకటించగా, 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఏటీఆర్‌గా మార్చారు. టైగర్ సఫారీలో టూరిస్టుల కోసం అన్ని వసతులతో డజను కాటేజీలను మన్ననూరులో ఏర్పాటుచేశారు.