
Hyderabad January 23: తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితులైన ప్రముఖ జ్యోత్యిష్య పండిత నిపుణులు, ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి (mulugu ramalingeswara siddanthi) ఆదివారం కన్నుమూశారు. ఊపిరి తీసుకోవడంలో సమస్య రావటంతో (Breathing Issue) కుటుంబ సభ్యులు పంజాగుట్టలోని నిమ్స్ (NIIMS) ఆసుపత్రికి తీసుకెళ్లారు. మార్గమధ్యలోనే రామలింగేశ్వర సిద్ధాంతి (Ramalingeswara siddanthi) తుది శ్వాస విడిచారని డాక్టర్లు వెల్లడించారు. టెలివిజన్ కార్యక్రమాల్లో వార ఫలాలు (weekly horoscope) చెబుతూ రామలింగేశ్వర సిద్ధాంతి తెలుగువారికి చేరువయ్యారు.
సిద్ధాంతి చెప్పే రాశి ఫలాలను తెలుగు రాష్ట్రాలతోపాటు విదేశాల్లో ఉండే తెలుగువారు కూడా విశ్వసిస్తుంటారు. దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా నిస్పక్షపాతమైన జ్యోతిష ఫలితాలు, పంచాంగం ద్వారా భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలను తన పంచాంగం (Panchagam) ద్వారా ప్రజలకు తెలియజేశారు. ఆయన గుంటూరు నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు.
ఎంతోమంది సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులకు, దేశ విదేశాలనుంచి వచ్చేవారికి జాతక విశ్లేషణ చేసి వారి సమస్యలకు పరిష్కారాలు తెలిపారు. శ్రీశైలంలో ఆశ్రమం స్థాపించి, వేదాల్లో, పూజా, హోమాది క్రతువుల్లో శిక్షణ పొందిన బ్రాహ్మణులతో ప్రతీమాస శివరాత్రికి పాశుపతహోమాలు నిర్వహించేవారు. ప్రతి సంవత్సరం ములుగు సిద్ధాంతి అందించే పంచాంగ ఫలితాలు ములుగు యూట్యూబ్ ఛానెల్ ద్వారా కోట్లాది మంది వీక్షకులకు అందించేవారు.
లోక కళ్యాణం కోసం, కరోనా మహమ్మారి నుంచి ప్రపంచానికి రక్షణ కోసం ఇటీవల యాదగిరిగుట్ట, శ్రీశైలం, శ్రీకాళహస్తిలలో ఆయుష్య హోమాలు నిర్వహించారు. ములుగు సిద్ధాంతిగా ఆధ్యాత్మిక జీవనాన్ని ప్రారంభించడానికి ముందు ఆయన ఎంఆర్ ప్రసాద్ పేరుతో మిమిక్రీ కళాకారుడిగా గుర్తింపుపొందారు. సినీ నటులు ఏవీఎస్, బ్రహ్మానందం వంటి కళాకారులతో వేలాది ప్రదర్శనలు నిర్వహించారు.