Redbus rPool | File Photo

Hyderabad, January 22:  బస్సుల్లో ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ సేవలను కల్పించే ప్రముఖ ప్రైవేట్ సంస్థ రెడ్‌బస్ (Redbus) ఇప్పుడు తన సేవలను విస్తరించింది. హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro)  ప్రయాణికుల కోసం ‘ఆర్‌పూల్’ ( rPool) యాప్‌ను లాంచ్ చేసింది. దీంతో ఇపుడు నగర ప్రజలకు కార్ పూల్, బైక్‌పూల్ (Car Pooling/ Bike Pooling) సర్వీసులు అందుబాటులోకి వచ్చినట్లయింది. ఇండ్ల నుంచి లేదా ఆఫీసుల నుండి మెట్రో స్టేషన్ వరకు చేరుకునేందుకు లేదా మెట్రో స్టేషన్ నుంచి ఇండ్లకు, ఆఫీసులకు తదితర గమ్యస్థానాలకు చేరుకునేందుకు వీలుగా తక్కువ ధరకే షేరింగ్ విధానంలో ప్రయాణించవచ్చు. అంతేకాకుండా ప్రయాణికులు తమ సొంత వాహనం ఉపయోగిస్తే తమ దారిలో ఇతరులను పికప్ లేదా డ్రాప్ చేసేందుకు ఈ యాప్ అవకాశం కల్పిస్తోంది. అందుకు మిగతావారి నుంచి కొంతమేర వసూల్ చేయబడిన ఛార్జ్ యజమానికి దక్కుతుంది.

ఈ విధానం ద్వారా మెట్రో కనెక్టివిటీ పెరగడమే కాకుండా, రోడ్లపై ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి మరియు వాహన ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడుతుంది.

ఈ సేవ ప్రయాణికులకు ఇల్లు మరియు వారి కార్యాలయాల మధ్య ప్రయాణించేటప్పుడు వారి వ్యక్తిగత కార్లు లేదా బైక్‌లలో ప్రయాణించడానికి వీలు కల్పిస్తుంది.

ఆసక్తి ఉన్న వినియోగదారులు 'రెడ్‌బస్ rPool’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. హోమ్ స్క్రీన్‌పై ఉన్న rPool ట్యాబ్‌పై క్లిక్ చేసి మీరు ఇతరులకు రైడ్ అందివ్వాలనుకుంటున్నారా (Offer Ride)? లేదా ఇతరులతో రైడ్ పొందాలనుకుంటున్నారా (Avail Ride) ?  మీ ఆప్షన్‌ను ఎంచుకొని, తేదీ, సమయం మరియు గమ్యం నమోదు చేయాలి, మీరు రైడ్ ఇవాలనుకుంటే ఒక్కొక్కరికి ఎంత ఛార్జ్ చేస్తారో ధరను మీరే నిర్ణయించవచ్చు. ఆ అలర్ట్స్ వస్తాయి, దాని ప్రకారం సంభాషించుకొని ప్రయాణాలు చేయవచ్చు.

కిలోమీటరుకు కనీసం రూ.2 ఛార్జితో రైడ్స్ ప్రారంభమవుతాయని రెడ్ బస్ సిఇఓ ప్రకాష్ సంగం చెప్పారు. రైడ్ ఇవ్వడానికి లేదా తీసుకోవటానికి 18 మెట్రో స్టేషన్లలో పార్కింగ్ స్థలాలు నిర్ధేషించబడి ఉంటాయని పేర్కొన్నారు.