Hyderabad, July: ఈనెల 13న హైదరాబాద్ లోని బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణంను అంగరంగ వైభవంగా నిర్వహించేలా ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం నిర్వహణ, ఏర్పాట్లపై ఆలయం ఆవరణలో మంత్రి సమీక్ష నిర్వహించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ జూలై 12న ఎదుర్కోళ్ళు, 13న కళ్యాణం, 14న రథోత్సవం నిర్వహించడం జరుగుతుందని వివరించారు. కళ్యాణం రోజున ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించనున్నట్లు చెప్పారు. గతేడాది కరోనా లాక్డౌన్ కారణంగా అమ్మవారి కళ్యాణం ఆలయం లోపల నిరాడంబరంగా నిర్వహించడం జరిగిందని, ఈ ఏడాది మాత్రం ఏర్పాట్లు ఘనంగా చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని శాఖల ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నట్లు తలసాని తెలిపారు.
అమ్మవారి కళ్యాణం సందర్భంగా బల్కంపేట ఆలయానికి 10 లక్షల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా పటిష్టమైన భారీకేడ్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా ఉత్సవాలు నిర్వహించే మూడు రోజుల పాటు నిరంతరం విద్యుత్ సరఫరా జరిగేలా విద్యుత్ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని వివరించారు. అమ్మవారి రథోత్సవం నిర్వహించే రహదారులలో ఎలాంటి గుంటలు లేకుండా చూడాలని, అవసరమైన ప్రాంతాలలో యుద్దప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని జోనల్ కమిషనర్ ప్రావిణ్యను మంత్రి ఆదేశించారు.
ఆలయ పరిసరాలలో పారిశుధ్య నిర్వహణ కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించాలని మంత్రి అధికారులకు సూచించారు. ఆలయ పరిసరాలలో భక్తుల రద్దీను దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఆంక్షల అమలుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆలయానికి వచ్చే రహదారులలో అవసరమైన ప్రాంతాలలో బారికేడ్లను ఏర్పాటు చేసి ట్రాఫిక్ డైవర్షన్ చేయాలని పోలీసు అధికారులను మంత్రి ఆదేశించారు.
భక్తుల సౌకర్యార్ధం ఆలయ పరిధిలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సాంస్కృతిక శాఖ కళాకారులచే పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించేలా ఏర్పాట్లు కూడా చేస్తున్నారని మంత్రి వివరించారు.