Hyderabad, AUG 24: ఆస్తమా (Asthma), ఉబ్బసం బాధితులకు చేప మందు పంపిణీ (Fish prasadam) చేసే బత్తిని హరినాథ్ గౌడ్ (Bathini Harinath goud) కన్నుమూశారు. బత్తిని సోదరుల్లో ఒకరైన 84 ఏండ్ల హరినాథ్ గౌడ్ గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో బుధవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన పేరు చెబితే ముందుగా గుర్తుకువచ్చేది చేప ప్రసాదం. ఏటా మృగశిర కార్తె (Mrigasira Karthi) రోజున హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో (Exhibition grounds) బత్తిని కుటుంబ సభ్యులు చేప మందు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చేప ప్రసాదం కోసం తెలంగాణ నలు మూలల నుంచే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో ఆస్తమా బాధులు రెండు రోజుల ముందుగానే నగరానికి వస్తుంటారు.
హైదరాబాద్ సంస్థానాధీశుడు నాలుగో నిజాం నాసిరుద్దౌలా కాలంలో పాతబస్తీ దూద్‌బౌలికి చెందిన బత్తిని వీరన్న గౌడ్ బేగంబజార్ ప్రాంతంలో కల్లు కాపౌండ్ నిర్వహించేవారు. ఒక రోజు భారీగా వర్షం పడుతుండగా తడిచిన ఓ సాధువు అక్కడికి రావడం గమనించిన వీరన్న గౌడ్ అతన్ని ఇంటికి తీసుకెళ్లి సపర్యలు చేశారు. సంతృప్తి చెందిన ఆ సాధువు తాను వెళ్లే సమయంలో ఆస్తమా వ్యాధిని నయం చేసే వనమూలికలను గురించి ఆయనకు చెప్పారు. ఈ వనమూలికలతో ప్రసాదం తయారు చేసి, ఏటా మృగశిర కార్తె ప్రవేశించిన తొలినాడే ఎలాంటి లాభాపేక్షలేకుండా రోగులకు ఉచితంగా పంపిణీ చేస్తే నీకు, నీ కుటుంబానికి మేలు జరుగుతుందని ఆ సాధువు వీరన్న గౌడ్‌కు తెలిపాడు. అప్పటి నుంచి వీరన్న గౌడ్ ప్రతి మృగశిర కార్తె ముందు రోజు నుంచి చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. ఇలా వీరన్న గౌడ్ తన ఇంటి వద్ద 1847లో చేప ప్రసాదం పంపిణీని ప్రారంభించాడు.
తదనంతరం తన కుమారుడు బత్తిని శివరామ గౌడ్, అతని కుమారుడు బత్తిని శంకర్‌గౌడ్ ఈ ప్రసాదాన్ని ఏటా వేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం శంకర్‌గౌడ్, సత్యమ్మ దంపతుల ఐదుగురు కుమారుల్లో బత్తిని హరినాథ్ గౌడ్, బత్తిని ఉమామహేశ్వర్ గౌడ్ వారి కుటుంబ సభ్యులు కలిసి చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. ఇలా గత 176 ఏండ్లుగా చేప మందు పంపిణీ కొనసాగుతూనే ఉన్నది. అయితే మధ్యలో కరోనా కారణంగా చేప ప్రసాదం పంపిణీ రెండేండ్ల పాటు నిలిచిపోయిన విషయం తెలిసిందే. చేపమందుకు కోసం వచ్చేవారికి ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేస్తూ వస్తున్నది.