Telangana: ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన బీజేపీ నేత రఘునందన్ రావు, ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్‌లు
bjp-leader-raghunandan-rao and newly-elected-mlcs were-sworn in Telangana (Photo-Twitter)

Hyd , Nov 18: తెలంగాణ దుబ్బాక ఉప ఎన్నికల్లో (Dubbaka By poll) గెలుపొందిన బీజేపీ నేత రఘునందన్ రావు బుధవారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్‌ ఛాంబర్‌లో మధ్యాహ్నం ఒంటి గంటకు అతికొద్ది మంది సమక్షంలో దుబ్బాక శాసనసభ సభ్యుడిగా రఘునందన్ రావు (raghunandan rao) ప్రమాణ స్వీకారం చేశారు. రఘునందన్ చేత అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించగా.. ఈ కార్యక్రమానికి అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, బీజేపీ నేతలు, ఎమ్మెల్సీ రామచందర్ రావు, ఎమ్మెల్యే రాజసింగ్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి హాజరయ్యారు.

కాగా నవంబర్ 10న దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం వెలువడిన విషయం తెలిసిందే. మొత్తం 23 రౌండ్లలో సాగిన దుబ్బాక లెక్కింపులో రఘనందన్‌రావుకు 62, 772 ఓట్లు రాగా.. సోలిపేట సుజాతకు 61, 302 ఓట్లు వచ్చాయి. దీంతో బీజేపీ అభ్యర్థి రఘనందన్‌రావు మొదటి సారిగా అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు.

ఇక నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్‌లు (Goreti Venkanna, Baswaraju Saraiah, Dayanand) ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త సభ్యుల చేత శాసనమండలి చైర్మన్‌ బుధవారం ప్రమాణస్వీకారం చేయించారు. దివంగత నాయిని నర్సింహారెడ్డి, రాములు నాయక్, కర్నె ప్రభాకర్‌ పదవీ కాలపరిమితి ముగియడంతో ఈ ఏడాది ఆగస్టు నాటికే శాసనమండలిలో గవర్నర్‌ కోటా స్థానాలు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం వీరికి పదవులను కేటాయించింది.