Etela Rajender on BRS Party: అక్రమంగా సంపాదించుకున్న డబ్బుతో దేశంలో రాజకీయాలు చేయాలని చూస్తున్నారు, తెలంగాణకు కేసీఆర్‌కు ఉన్న బంధం తెగిపోయిందని తెలిపిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్
Etela Rajender (Photo-Twitter)

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. బీఆర్‌ఎస్‌ పార్టీని స్థాపించడంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ స్పందించారు. టీఆర్‌ఎస్‌ పార్టీని బీఆర్‌ఎస్‌గా పేరు మారుస్తూ తీర్మానం చేయడాన్ని ఈటల తీవ్రంగా తప్పుబట్టారు. ‘బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రకటనతో తెలంగాణకు కేసీఆర్‌కు ఉన్న బంధం తెగిపోయింది. ఉద్యమ పార్టీని కతం పట్టించి, ఉద్యమకారులను మరిచిపోయేటట్లు చేసి కేసీఆర్‌ ముద్ర ఉండే పార్టీని స్థాపించారు.

దేశ రాజకీయాల్లోకి భార‌త రాష్ట్ర స‌మితి, తెలంగాణ రాష్ట్ర స‌మితి పేరునే భార‌త రాష్ట్ర స‌మితిగా మారుస్తూ అధికారిక ప్రకటన చేసిన సీఎం కేసీఆర్

ఆ పార్టీ స్థాపనతోనే తెలంగాణకు కేసీఆర్‌కు ఉన్న బంధం పూర్తిగా తెగిపోయింది. తెలంగాణ ప్రజానీకానికి టీఆర్‌ఎస్‌ పార్టీకి ఉండే బంధం తెగిపోయింది. తెలంగాణ ఉద్యమ కారులకు, తెలంగాణ చైతన్యానికి కేసీఆర్‌కు ఉన్న బంధం తెగిపోయింది. అక్రమంగా సంపాదించుకున్న డబ్బుతో దేశంలో రాజకీయ చెలామణి చేయాలని పగటికలకంటున్నారు. కూట్లో రాయి తీయలేనివాడు.. ఏట్లో రాయి తీయడానికి పోయినట్లు ఉంది’ అని ఈటల రాజేందర్‌ ఎద్దేవా చేశారు.