Hyderabad, FEB 01: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ఇవాళ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న నేతగా కేసీఆర్ 8వసారి ప్రమాణం (KCR Oath) చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక మూడోసారి ఎమ్మెల్యేగా (MLA Oath) ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. స్పీకర్ ఛాంబర్ లో మధ్యాహ్నం 12.30 నిమిషాల తరువాత ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఆ వెంటనే ప్రమాదవ శాత్తూ కేసీఆర్ గాయపడటంతో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేదు. తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స అనంతరం ఆరు నుంచి ఎనిమిది వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.
KCR to take Oath Tomorrow: రేపు ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం.. పార్టీ ఎమ్మెల్యేలందరికీ ఆహ్వానం
దీంతో ఆయన రెండు నెలలుపాటు గజ్వేల్ వ్యవసాయ క్షేత్రంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడు కర్ర సాయంతో వైద్యుల పర్యవేక్షణలో నెమ్మదిగా నడుస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12గంటలకు కేసీఆర్ అసెంబ్లీకి చేరుకుంటారు. అసెంబ్లీ ఆవరణలో శాసనసభాపక్ష నేతగా ఆయనకు కేటాయించిన చాంబర్ లో కేసీఆర్ ముందుగా పూజలు చేస్తారు. 12.30 గంటలలోపు ప్రతిపక్ష నేతగా పూజలు చేస్తారు. ఆ తరువాత స్పీకర్ గడ్డం ప్రసాద్ ఛాంబర్ లో కేసీఆర్ శాసన సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తారు.
కేసీఆర్ 1985 నుంచి 1999 వరకు వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
2001లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కేసీఆర్.. మరోసారి సిద్ధిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
తెలంగాణ ఉద్యమ ప్రభావంతో 2004 ఎన్నికల్లో సిద్ధిపేట ఎమ్మెల్యేతో పాటు కరీంనగర్ ఎంపీగా పోటీ చేశారు. రెండు చోట్ల విజయం సాధించడంతో కేసీఆర్ ఎంపీగా కొనసాగారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
2009 ఎన్నికల్లో మహబూబ్ నగర్ ఎంపీగా కేసీఆర్ విజయం సాధించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి కేసీఆర్ విజయం సాధిస్తూ వచ్చారు.
గజ్వేల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా కేసీఆర్ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేసీఆర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తరలిరానున్నారు. దీంతో అసెంబ్లీ ప్రాంగణం వద్ద భద్రతను ఏర్పాటు చేశారు.