Hyd, Aug 18: తెలంగాణ రుణమాఫీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి లేఖరావారు మాజీ మంత్రి కేటీఆర్. రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని లేఖలో పేర్కొన్నారు. రుణమాఫీ అందని లక్షలాదిమంది రైతుల తరఫున లేఖ రాస్తున్నానని తెలిపిన కేటీఆర్...కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, రైతులందరికీ రుణమాఫీ చేయాలని చెప్పారు. . రైతులందరికీ రుణమాఫీ చేయకపోతే తాము వారి తరఫున పోరాడుతామని స్పష్టం చేశారు.
వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట హామీలు ఇచ్చారని, రైతులకి రెండు రక్షల రుణమాఫీ ఇస్తామన్నారని చెప్పారు. రూ.40 వేల కోట్ల రుణమాఫీ అని చెప్పి కేవలం రూ.17 వేల కోట్లకు పైగా రుణమాఫీ చేశారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన అబద్ధాలు, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలకు మధ్య ఉన్న స్పష్టమైన తేడాను ఆ లేఖలో పొందుపరిచారు.
కేటీఆర్ లేఖలో పేర్కొన్న సారాంశం...
గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు లక్షరూపాయల రుణమాఫీ చేస్తేనే 17 వేల కోట్లు ఖర్చయింది. ఏకంగా 36 లక్షల మంది రైతులు రుణవిముక్తులై లబ్ది చేకూరింది. కాంగ్రెస్ చెబుతున్నట్టు రెండు లక్షల రుణమాఫీ పూర్తయితే.. లబ్దిదారుల సంఖ్యతోపాటు రుణమాఫీ మొత్తం పెరగాలి, దాదాపు రెట్టింపు కావాలి. కానీ కేవలం 17,900 కోట్లతో రెండు లక్షల రుణమాఫీని పూర్తిచేశామనడం ముఖ్యమంత్రి డొల్లవాదనకు నిదర్శనం. 47 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి 22 లక్షల మందికి తూతూమంత్రంగా చేయడం.. కాంగ్రెస్ సర్కారు అసమర్థతకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది.
అసలు లక్ష రూపాయల రుణమాఫీ కన్నా.. రెండు లక్షల రుణమాఫీ లబ్దిదారుల సంఖ్య 14 లక్షలు తగ్గడం రైతు రుణమాఫీ ఏ మేరకు విఫలమైందో అద్దం పడుతుంది. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ లెక్క ప్రకారం రెండు లక్షల రుణమాఫీకి 49,500 కోట్లు అంచనా వేశారు. ముఖ్యమంత్రే స్వయంగా రుణమాఫీకి 40వేల కోట్ల వరకు అవుతుందని తొలుత చెప్పుకొచ్చారు. కడుపు కట్టుకుంటే.. ఇది పెద్ద విషయం కాదని ఇంటర్వ్యూల్లో గొప్పలు చెప్పారు. చివరికి రాష్ట్ర కేబినెట్ సమావేశం వరకు వచ్చే సరికి 31 వేలకు దీన్ని కుదించారు. కనీసం అంతమేరకైనా చేశారా అంటే అదీ లేదు. రాష్ట్ర బడ్జెట్ లో మరింత కోత పెట్టి 26 వేల కోట్లు మాత్రమే కేటాయించారు. తీరా మూడు విడతల రుణమాఫీ తతంగాన్ని రూ.17,933 కోట్లతో మమ అనిపించారు. 49,500 కోట్ల రూపాయల రెండు లక్షల రుణమాఫీ కాస్తా.. మూడు విడతల్లో దాదాపు మూడింతలు తగ్గి 17,933 చేరింది. 40 శాతం కూడా రుణమాఫీ చేయకుండా.. లక్షలాది మంది రైతులను నట్టేట ముంచి ప్రక్రియ పూర్తయిందని సీఎం రేవంత్ రెడ్డి చేతులెత్తేయడంతో.. యావత్ తెలంగాణ ఇవాళ రైతుల ఆందోళనలతో అట్టుడుకుతోంది.
ఆదిలాబాద్ జిల్లాలోని బోధ్ లో రుణమాఫీ కాని అన్నదాతలు రోడ్డెక్కారు. మంచిర్యాలలో రుణమాఫీ కాలేదని మనస్థాపం చెంది ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేశాడు. అటు కరీంనగర్ రాజీవ్ రహదారిపై అన్నదాతలు రాస్తారోకో నిర్వహించి సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దేవుడి మీద ఓట్ల పెట్టి మరీ మోసం చేసిన ముఖ్యమంత్రి తీరుపై రైతులోకం ఆగ్రహంతో ఊగిపోతోంది. రంగంలోకి దిగనున్న కేసీఆర్, పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి, త్వరలో కీలక నేతలతో పలు రాష్ట్రాల టూర్!
Here's Tweet:
Farm Loan Fraud chronicles of Telangana Govt
Sri @RahulGandhi Ji,
✳️ Congress promised 9th December, 2023 as the date for waiving off all Farm loans up to ₹ 2 Lakhs
❌ The goal post is then shifted to August 15th, 2024 without offering any explanation
✳️ State Level… pic.twitter.com/hnIHKdckaq
— KTR (@KTRBRS) August 18, 2024
ఇప్పటికే అనేక జిల్లాల్లో అప్పుల భారం భరించలేక ఎంతోమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అడ్డగోలు ఆంక్షలు..అర్థంలేని షరతులతో ఒక ప్రహసనంగా మార్చిన రుణమాఫీని రైతులందరికీ పూర్తిచేయాలి. రైతు రుణమాఫీకి సంబంధించి మా పార్టీ ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్ కి కేవలం వారం రోజుల వ్యవధిలోనే 1,20,000 కు పైగా ఫిర్యాదులు వచ్చాయి.
కాంగ్రెస్ అధిష్టానానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. రైతులను నిలువునా మోసం మోసం చేసిన ఈ రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు తన వైఖరి మార్చుకొని రాష్ట్రంలోని అన్నదాతలందరికీ ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని రాష్ట్రంలోని అన్నదాతల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అప్పటివరకు తెలంగాణ రైతాంగం పక్షాన పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాను అని తెలిపారు కేటీఆర్.