Hyd, Jan 4: మందమర్రి టోల్‌ప్లాజా వద్ద బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య (BRS MLA Durgam Chinnaiah) హల్‌చల్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి విదితమే. తన వాహనానికి రూట్ క్లియర్ చేయలేదంటూ టోల్‌ప్లాజా సిబ్బందిపై (toll plaza staff)దాడి చేశారని వీడియో ద్వారా తెలుస్తోంది. కాగా మందమర్రి టోల్‌ప్లాజా సిబ్బందిపై దాడి చేసినట్లు వస్తున్న వార్తలపై స్పందించారు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. దాడి వార్తలను ఖండించారు. జాతీయ రహదారి పనులు పూర్తి కాకుండానే టోల్ వసూలు చేస్తున్నారని, అంబులెన్స్‌ను సైతం వదలటం లేదన్నారు. ఈవిషయంపైనే మేనేజర్‌తో మాట్లాడేందుకు వెళ్లినట్లు స్పష్టం చేశారు.
‘నేను దాడి చేసినట్లుగా టీవీలలో వార్తలు వస్తున్నాయి. జాతీయ రహదారి పనులు పూర్తి కాలేదు. సోమగూడేం ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేయలేదు. కాని టోల్ ప్లాజాలో నూటయాభై టోల్ వసూలు చేస్తున్నారు. టోల్ ప్లాజా నుండి అంబులెన్స్ కూడ వదలడం లేదు. ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు.ఈ విషయాలపై మేనేజర్‌తో మాట్లాడానికి వెళ్లాను. మేనేజర్ నుంచి ఎటువంటి స్పందింన లేదు. అంతే కానీ నేను దాడి చేయలేదు. కనీసం టోల్ ప్లాజా ప్రారంభానికి కూడా నన్ను పిలువలేదు’ అని దాడి వార్తలను బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఖండించారు.
టోల్‌ప్లాజా వద్దకు వచ్చిన క్రమంలో తనకు రూట్ క్లియర్ చేయలేదంటూ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దౌర్జన్యానికి దిగారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు వారు తెలిపారు. తమకు న్యాయం చేయాలని, ఎమ్మెల్యేపై పోలీసులు చర్యలు తీసుకోకపోతే ఉద్యమం కూడా చేస్తామని హెచ్చరించారు.