సంగారెడ్డి, ఫిబ్రవరి 23: కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత (BRS MLA Lasya Nanditha Dies) శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.ఈ ఘటనలో ఎమ్మెల్యే లాస్య నందిత కారు డ్రైవర్ ఆకాశ్‌పై కేసు నమోదు (Case Registered Against on MLA PA) చేసినట్లు సంగారెడ్డి జిల్లా పోలీసులు తెలిపారు. కారు ప్రమాదం ఘటనపై లాస్య నందిత సోదరి నివేదిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
డ్రైవర్ ఆకాశ్‌పై 304ఏ సెక్షన్ కింద పటాన్‌చెరు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైందన్నారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా కారు నడిపాడని లాస్య సోదరి నివేదిత తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అతి వేగంగా కారు నడిపి లాస్య మృతికి కారణమయ్యాడని ఆమె అన్నారు. ఉదయం 5.15 గంటలకు ఆకాశ్ ఫోన్ చేశారని.. ఇద్దరికీ దెబ్బలు తగిలాయని లోకేషన్ షేర్ చేశాడని లాస్య సోదరి నివేదిత తెలిపింది. మేం వెళ్లి చూసేసరికి కారు నుజ్జునుజ్జుగా ఉందని ఆమె చెప్పింది.
లాస్య నందిత భౌతికకాయానికి నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి, పలువురు కాంగ్రెస్ మంత్రులు
ఈ ప్రమాద ఘటనపై సంగారెడ్డి జిల్లా అడిషనల్ ఎస్పీ సంజీవరావు మీడియాకు వివరాలు వెల్లడించారు.అతివేగంగా కారు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని సంగారెడ్డి ఏఎస్పీ సంజీవ్‌రావు వెల్లడించారు.ముందున్న వాహనాన్ని ఢీకొట్టిన తర్వాత.. అదుపు తప్పి ఓఆర్‌ఆర్ పక్కన రెయిలింగ్‌ను ఢీకొట్టింది. ప్రమాదం జరిగినప్పుడు లాస్య నందిత బతికే ఉంది. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందింది. ప్రమాదంలో లాస్య పీఏ ఆకాష్ కాళ్లు విరిగిపోయాయని ఏఎస్పీ తెలిపారు.
ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాదం జరిగిన సమయంలో కారులో లాస్య నందితతో పాటు ఆమె డ్రైవర్ ఆకాశ్(24) ఉన్నాడు. సదాశివపేటలోని దర్గాకు వెళ్లేందుకు ఎమ్మెల్యే లాస్య నందిత తన ఇంటి నుంచి శుక్రవారం తెల్లవారుజామున బయల్దేరారు. తెల్లవారుజామున 4:58 గంటల సమయంలో శామీర్‌పేట టోల్ ప్లాజా వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపైకి ప్రవేశించారు.
సుల్తాన్‌పూర్ ఎగ్జిట్ సమీపంలో ఉదయం 5:30 గంటల సమయంలో ముందు వెళ్తున్న వాహనాన్ని ఎమ్మెల్యే కారు ఢీకొట్టింది. దీంతో కారు అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో లాస్య నందిత బతికే ఉన్నారు. ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. పీఏ ఆకాశ్ ఎడమకాలు విరిగిపోయింది. అతను శ్రీకర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఏఎస్పీ సంజీవ రావు తెలిపారు. ఇది రోడ్డు ప్రమాదమే అని పోలీసులు తేల్చారు.