Hyderabad, OCT 13: తెలంగాణలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ (Congress Govt)ఇచ్చిన హామీలను అమలు చేయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ పెట్టింది. హామీల అమలుపై ఢిల్లీ కేంద్రంగా భారీ ఆందోళన చేసేందుకు బీఆర్ఎస్ (BRS) పార్టీ రెడీ అవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి నిరసనగా ఢిల్లీలో అగ్రనేత రాహుల్ గాంధీ నివాసం ముందు భారీ ధర్నా చేయాలని గులాబీ పార్టీ నిర్ణయించింది. గత బీఆర్ఎస్ సర్కార్ అమలు చేస్తున్న పథకాలకు తోడు భారీగా సంక్షేమ పథకాలను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది. కీలకంగా 6 గ్యారెంటీలు, 11 హామీలు అంటూనే.. మొత్తం 420 వరకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. కాంగ్రెస్ మ్యానిఫెస్టోతో తెలంగాణలో రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు తెలపడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు స్కీమ్ ను (Free Bus) యుద్ధ ప్రాతిపదికన అమలు చేసింది రేవంత్ సర్కార్. మిగిలిన కీలక హామీలను అమలు చేయడంలో విఫలమైందని గులాబీ పార్టీ ఆరోపిస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చేతులెత్తేసిందని, తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ హామీల అమలును గాలికి వదిలేసిందని బీఆర్ఎస్ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను కాంగ్రెస్ హైకమాండ్ కు వినిపించేందుకు బీఆర్ఎస్ ప్రణాళికలు వేస్తోంది.
అయితే, త్వరలో మహారాష్ట్ర సహా మరిన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీలో ధర్నా (BRS Plan To Hold Dharna) నిర్వహిస్తే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అనే తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని కొందరు బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది సందర్భంగా ధర్నా నిర్వహిస్తే బాగుంటుందనే అభిప్రాయం మరికొందరు గులాబీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, దసరా పండుగ పూర్తి కావడంతో పార్టీ అధినేత కేసీఆర్ (KCR) ఢిల్లీలో ధర్నాపై నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. హస్తినలో బీఆర్ఎస్ ధర్నాపై కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని పార్టీ నేతల్లో చర్చ మొదలైంది.