Jagtial, Feb 15: జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మేడిపల్లి మండలం కట్లకుంట వద్ద ఓ కారు అదుపు తప్పి ఎస్సారెస్పీ కాలువలోకి (Car Plunges into Canal in Jagtial) దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. ఒకరు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. వారిని కోరుట్ల మండలం జోగినిపల్లికి చెందిన న్యాయవాది అమరేందర్ రావు కుటుంబసభ్యులుగా గుర్తించారు. ఈ ఫ్యామిలీ జగిత్యాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ (Jagtial)TRS MLA Sanjay Kumar) సమీప బంధువులని తెలుస్తోంది.
అమరేందర్ రావు భార్య శిరీషా కూతురు శ్రేయా, కుమారుడు జయంత్ నలుగురు కారులో హైదరాబాద్ వెళ్ళి తిరిగి వస్తుండగా సోమవారం తెల్లవారుజామున కారు ప్రమాదానికి గురైంది. ముగ్గురు కారుతో సహ గల్లంతయ్యారు. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ జయంత్ బయటికి వచ్చి చెప్పేవరకు కారు కెనాల్‌లో పడ్డ విషయం ఎవరికీ తెలియదు. ప్రమాదం గురించి తెలిసిన పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని కెనాల్‌లో నీటిని నిలిపివేసి గాలింపు చర్యలు చేపట్టారు.
పోలీసులు అక్కడికి చేరుకుని క్రేన్ సహాయంతో కారును బయటకు తీశారు. ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద విషయం తెలిసి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అక్కడికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరుపై జయంత్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
గతేడాది ఫిబ్రవరిలో పెద్దపల్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సోదరి కుటుంబం కూడా ఇలాగే ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. వారు ప్రయాణిస్తున్న కారు కరీంనగర్ జిల్లా అలుగునూర్ సమీపంలోని కాకతీయ కెనాల్ కాలువలో పడటంతో మృత్యువాతపడ్డారు.
జగిత్యాల జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీ కొద్దిరోజుల క్రితం వరంగల్ జిల్లాలోని పర్వతగిరి మండలం కొంకపాకలోనూ ఇదే తరహాలో ఓ కారు ఎస్సారెస్పీ కెనాల్‌లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒక ఉపాధ్యాయురాలితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. వరంగల్ నుంచి పర్వతగిరి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.