File image used for representational purpose | (Photo Credits: ANI)

Hyd, Dec 12 : ఢిల్లీ మద్యం కేసులో తెలంగాణ ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు ఆదివారం ఆరు గంటలకు పైగా విచారించారు. ఓ మహిళా అధికారి సహా అయిదుగురు సభ్యుల సీబీఐ బృందం ఢిల్లీ నుంచి వచ్చింది. మద్యం కేసులో (Delhi Liquor Policy Case) 160 సీఆర్‌పీసీ చట్టం ప్రకారం సాక్షిగా విచారించనున్నామని సీబీఐ ముందుగానే కవితకు (KCR's daughter Kavitha) సమాచారం పంపిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కవిత నివాసానికి వచ్చిన సీబీఐ అధికారులు.. మద్యం కేసులో దక్షిణాది లాబీ అంశాల గురించి ఆమెను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితకు సీబీఐ షాక్.. రేపు మరోసారి విచారించనున్న సీబీఐ అధికారులు?

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అరెస్టు చేసిన శరత్‌చంద్రారెడ్డి, సీబీఐ అరెస్టు చేసిన బోయినపల్లి అభిషేక్‌, నిందితుడు రామచంద్ర పిళ్లైలతో పరిచయాలు, వ్యాపార సంబంధాలు ఉన్నాయా అని ఆరా తీసినట్లు సమాచారం. దర్యాప్తులో వెల్లడైన అంశాలు, సోదాల్లో స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా ముందుగానే సిద్ధం చేసుకున్న ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది.

కవిత ఇచ్చిన వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేసుకున్నారు. దీనికి సంబంధించి ‘మీ వద్ద ఉన్న ఆధారాలు మాకు సమర్పించాలంటూ కవితకు 91 సీఆర్‌పీసీ కింద మరో నోటీసు జారీ చేసినట్లు సమాచారం. విచారణ మధ్యలో కొద్దిసేపు భోజన విరామం ఇచ్చారు. సాయంత్రం ఆరున్నర గంటలకు వారు కవిత ఇంటి నుంచి బయటకు వెళ్లారు.