New Delhi, April 11: కేంద్రంపై పోరాటానికి తెలంగాణ ప్రజులు, రైతులు సిద్ధంగా ఉన్నారని, తాడోపేడో తేల్చుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారు. కేంద్రానికి 24 గంటల డెడ్‌లైన్ విధించారు కేసీఆర్. 24 గంటల్లోపు ధాన్యం సేకరణపై కేంద్రం ఓ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలోని రైతులు భిక్షగాళ్లు కాదు.. ఒకే విధానం లేకపోతే రైతులు రోడ్లపైకి వస్తారని కేసీఆర్ స్పష్టం చేశారు. మోదీ, పీయూష్ గోయల్‌కు రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాను.. తెలంగాణ రైతులు (Telangana farmers) పండించిన ధాన్యాన్ని కొనాలని కోరుతున్నానని కేసీఆర్ పేర్కొన్నారు.
రైతుల పట్ల మోసపూరితంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR at Dhrana) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ పాలసీ రూపొందించాలని కేంద్రాన్ని కేసీఆర్ డిమాండ్ చేశారు. లేకుంటే మోదీని తరిమికొడుతాం (PM Modi that you can't mess with farmers) అని హెచ్చరించారు. వచ్చే ప్రభుత్వంతో ఆ పాలసీని రూపొందిస్తామని స్పష్టం చేశారు. మోదీకి ధనం కావాలి లేదా ఓట్లు కావాలి. ధాన్యం వద్దు.. ఇదే మీ ప్రభుత్వ కుట్ర అని కేసీఆర్ నిప్పులు చెరిగారు. రైతులకు కనీస మద్దతు ధర వచ్చే వరకు పోరాటం చేస్తామని తేల్చిచెప్పారు.
తెలంగాణ నుంచి సుమారు 2 వేల కి.మీ. దూరం వచ్చి దీక్ష చేస్తున్నాం. ఇంత దూరం వచ్చి ఆందోళన చేయడానికి కారణమెవరు? నరేంద్ర మోదీ ఎవరితోనైనా పెట్టుకో.. కానీ రైతుల వద్ద మాత్రం పెట్టుకోవద్దు. ప్రభుత్వంలో ఎవరూ శాశ్వతంగా ఉండరు. కేంద్రం ధాన్యం కొనాలని ఢిల్లీలో దీక్ష చేస్తున్నాం. దీక్షకు మద్దతిచ్చేందుకు వచ్చిన రాకేశ్ తికాయత్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కేసీఆర్.
Here's ANI UPdate
#WATCH | Is growing paddy Telangana farmers' fault?...I warn PM Modi that you can't mess with farmers. Indian history is a testament that wherever farmers cried, govt loses power.Nobody is permanent...When in power,don't treat farmers unfairly: Telangana CM KCR at dharna, Delhi pic.twitter.com/uqCzSdG3Bl
— ANI (@ANI) April 11, 2022
ఉద్యమాల పోరాట ఫలితంగా 2014లో తెలంగాణ వచ్చిందని కేసీఆర్ గుర్తు చేశారు. రాష్ట్రం వచ్చాక రైతుల కోసం అనేక సంస్కరణలు తెచ్చామని తెలిపారు. రైతులకు ఉచితంగా 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించాం. ప్రాజెక్టులను పూర్తి చేసుకున్నాం. సాగుకు సరిపడా నీటిని అందిస్తున్నామని చెప్పారు. తెలంగాణలో కోటి ఎకరాల భూమి సాగులోకి వచ్చిందన్నారు. ప్రధాని స్వరాష్ట్రం గుజరాత్‌లో విద్యుత్ కోసం రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయని కేసీఆర్ తెలిపారు.
రైతుల సంక్షేమం కోసం జాతీయ రైతు ఉద్యమ నాయకుడు రాకేశ్ తికాయత్‌తో కలిసి పని చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజానీకం తికాయత్ వెంట ఉంటుందని చెప్పారు. రాకేశ్ తికాయత్‌ను కేంద్రం ఎన్ని విధాలుగా అవమానించిందో మనమంతా చూశామని తెలిపారు. తికాయత్‌ను దేశద్రోహి అన్నారు.. ఉగ్రవాది అన్నారు. రైతుల కోసం అవమానాలు భరిస్తూనే ముందుకు సాగుతున్నారని కేసీఆర్ పేర్కొన్నారు.
అలాగే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. దేశంలో భూకంపం సృష్టిస్తాం.. పీయూష్ గోయల్ పరుగులు తీయాల్సిందేనని కేసీఆర్ హెచ్చరించారు. హిట్లర్, నెపోలియన్ వంటి అహంకారులు కాలగర్భంలో కలిసిపోయారు.. పీయూష్‌కు ఎందుకు ఇంత అహంకారం అని కేసీఆర్ నిలదీశారు. పీయూష్ గోయల్ ఉల్టాఫల్టా మాట్లాడుతున్నారు. ఆయనకు రైతులపై ఏమైనా అవగాహన ఉందా? అని ప్రశ్నించారు. పీయూష్ గోయల్ మీరు ఇంత సంస్కారహీనంగా ఎలా మాట్లాడారు. మా రైతులను, మంత్రులను అవహేళన చేశారని కేసీఆర్ నిప్పులు చెరిగారు.
కేంద్ర మంత్రి తెలంగాణ రైతులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చాలా బాధకరమైనవి. పీయూష్ గోయల్ తెలంగాణ అన్నదాతలు నూకలు తినాలని చెప్పారు. మేమైనా గోయల్ వద్ద అడుక్కోవడానికి వచ్చామా? పీయూష్ గోయల్ కాదు.. పీయూష్ గోల్ మాల్ అని విమర్శించారు. దేశ వ్యాప్తంగా ఎక్కడా లేనంతగా 30 లక్షల బోర్లు తెలంగాణలో ఉన్నాయి. మోటార్, విద్యుత్ తీగలు, బోర్ల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో సాగు రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందన్నారు. స్వరాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగ చేశామన్నారు. రైతు ఏడ్చిన రాజ్యం ఏది బాగుపడలేదు. ధాన్యం సేకరణకు దేశ వ్యాప్తంగా ఒకే విధానం ఉండాలని డిమాండ్ చేస్తున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు.