Telangana CM K Chandrasekhar Rao | File Photo

Hyderabad, December 7: తెలంగాణలో ఈ ఏడాది రెండవ విడత రైతుబంధు సహాయం కోసం నిధుల విడుదల, పంపిణీకి సంబంధించి ఈరోజు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు వ్యవసాయ, ఆర్థిక శాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. రైతుబంధు సహాయం పంపిణీకి అనుసరించాల్సిన విధానంపై చర్చించి, కార్యాచరణను ఖరారు చేశారు. ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చే నెల (జనవరి) 7వ తేదీ వరకు రైతులకు రైతుబంధు సహాయం అందించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.
రాష్ట్రంలో ఏ ఒక్క రైతు మిగలకుండా అందరికీ సాయం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. రైతుల ఖాతాలోనే నేరుగా డబ్బులను జమ చేయాలని చెప్పారు. దీనికోసం అవసరమైన రూ.7,300 కోట్లను విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. తక్కువ విస్తీర్ణం కలిగిన రైతుల నుంచి మొదలుపెట్టి, ఎక్కువ విస్తీర్ణం కలిగిన రైతుల వరకు అందరికీ పది రోజుల వ్యవధిలో డబ్బులు జమ చేయాలని సూచించారు.

ఈరోజు జరిగిన సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి  ఎస్. నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి  రామకృష్ణ రావు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి  జనార్థన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నిజానికి నవంబర్ నెలలోనే రైతు బంధు నిధులు రైతుల ఖాతాల్లోకి జమ కావాల్సి ఉంది. అయితే ఈ ఏడాది కొవిడ్19 వ్యాప్తి, జీహెచ్ఎంసీ ఎన్నికలు తదితర కారణాల చేత కాస్త ఆలస్యమయ్యింది.
ఇదిలా ఉంటే, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశంలోని పలు రైతు సంఘాలు డిసెంబర్ 8న భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ బంద్‌కు టీఆర్ఎస్ పార్టీ తన సంపూర్ణ మద్దతు ప్రకటించింది. రాస్తారోకోలు, ధర్నాల్లో ప్రత్యక్షంగా పాల్గొనాలని టీఆర్ఎస్ కార్యవర్గం నిర్ణయించింది.