Hyderabad Metro: కరోనా ప్రభావంతో నష్టాల్లో కూరుకుపోయిన హైదరాబాద్ మెట్రో, నగరానికి మెట్రో సేవలు ఎంతో అవసరమని పేర్కొన్న సీఎం కేసీఆర్, ప్రభుత్వం తన బాధ్యతగా మెట్రోను ఆదుకుంటుందని హామి
Hyderabad Metro - CM KCR | File Photo

Hyderabad, September 15: హైదరాబాద్ మెట్రోను ఆదుకునేందుకు ఉన్న అవకాశాలను అన్వేషిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. నష్టాల్లో కూరుకుపోయిన మెట్రోను తిరిగి గాడిలో పడేలా ప్రభుత్వం సహకరిస్తుందని ఎల్ అండ్ టి ఉన్నతాధికారులకు సీఎం హామీ ఇచ్చారు.

కరోనా లాక్డౌన్ ప్రభావంతో చాలా కాలం పాటు ప్రయాణాలు నిలిచిపోయాయి, అలాగే ప్రజలు కూడా సొంత వాహనాల్లో ప్రయాణించడానికే మొగ్గుచూపుతున్నారు. దీంతో హైదరాబాద్ మెట్రోకు ఆదరణ లేక ఆర్థికంగా నష్టాల్లో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో తమను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఎల్ అండ్ టి కంపెనీ ఉన్నతాధికారులు పలు దఫాలుగా విజ్ఞప్తి చేశారు. ప్రగతి భవన్ లో సీఎం కేసిఆర్ తో భేటీ అయిన ఎల్ అండ్ టి ఉన్నతాధికారులు లాక్డౌన్ కాలం నుంచి మెట్రో ఎదుర్కోంటున్న ఆర్థిక నష్టాలు, బ్యాంకు అప్పులు, రోజురోజుకు పేరుకుపోతున్న వడ్డీల వివరాలను విన్నవించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... అనతి కాలంలోనే సురక్షిత ప్రజా రవాణా వ్యవస్థగా హైదరాబాద్ మెట్రో సేవలందిస్తూ ప్రజాదరణ పొందిందన్నారు. కరోనా పరిస్థితులు అన్ని రంగాలను ప్రభావితం చేసినట్లే మెట్రోను కూడా ఇబ్బందుల్లోకి నెట్టిందని తెలిపారు. దినాదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరానికి మెట్రో సేవలు ఎంతో అవసరమని, భవిష్యత్తులో మెట్రో మరింతగా విస్తరించాల్సి ఉందన్నారు. కరోనా దెబ్బతో మెట్రో అప్పుల్లో కూరుకుపోవడం, వడ్డీలకు వడ్డీలు కట్టాల్సి రావడం శోచనీయమన్నారు.

అన్ని రంగాలను ఆదుకున్నట్లే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక హైదరాబాద్ మెట్రోను కూడా గాడిలో పెట్టడానికి తమవంతు కృషి చేస్తుందన్నారు. ఎటువంటి విధానాలు అవలంభించడం ద్వారా మెట్రోకు మేలు చేయగలుగుతాయో విశ్లేషిస్తామని తెలిపారు. సాధ్యాసాధ్యాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. ప్రజావసరాల దృష్ట్యా కరోనా వంటి క్లిష్ట సందర్భాల్లో వినూత్నంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలసి వస్తుందన్నారు. హైదరాబాద్ మెట్రోను ఆదుకోవడంతో పాటు తిరిగి పుంజుకుని ప్రజావసరాల దృష్ట్యా మరింతగా విస్తరించే దిశగా చర్యలు చేపడతామని సీఎం వారికి హామీ ఇచ్చారు.

ఇందుకు గాను విస్తృతంగా చర్చించి పూర్వాపరాలను పరిశీలించి ఏ విధానం అవలంభించడం ద్వారా మెట్రోకు పూర్వవైభవాన్ని తీసుకురాగలమో అవగాహన కోసం ఒక అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ కమిటీలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఎంఎయూడి స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ ఉంటారని సిఎం తెలిపారు. మెట్రోను నష్టాల నుంచి గట్టెక్కించేలా రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందుకెళ్లాలి అనే అంశంపై అన్ని రకాలుగా పరిశీలించి అధ్యయనం చేసి అతి త్వరలో నివేదిక అందించాలని సీఎం ఆదేశించారు.