CM KCR Meeting (Photo-TS CMO)

Hyderabad, July 23: నీరటి, మస్కూరు, లష్కర్ వంటి కాలం చెల్లిన పేర్లతో పిలువబడుతూ, భూస్వామ్య వ్యవస్థకు చిహ్నాలుగా మిగిలిన వీఆర్ఏ వ్యవస్థను (VRA) శాశ్వతంగా రద్దు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలుగా పనిచేస్తున్న సిబ్బందిని రెవెన్యూ శాఖలో సూపర్ న్యూమరరీ పోస్టుల్లో క్రమబద్ధీకరించనున్నట్టు సీఎం తెలిపారు. మంత్రుల సబ్ కమిటీ (Sub Committee) సిఫారసుల మేరకు, నిబంధనలను అనుసరించి వీఆర్ఏల అర్హతలను ప్రకారం, మున్సిపాలిటీ, మిషన్ భగీరథ, ఇరిగేషన్ తదితర శాఖల్లో సర్దుబాటు చేస్తూ వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సోమవారం విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని సీఎం ఆదేశించారు.

సామాజిక పరిణామ క్రమంలో మార్పులకనుగుణంగా, ప్రజల అవసరాలను అనుసరించి పాలకులు నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని, కాలానుగుణంగా కనుమరుగవుతున్న వృత్తుల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యామ్నాయంగా ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇదే రాష్ట్ర ప్రభుత్వ విధానమని, ఈ విధానాన్ని అనుసరించే వీఆర్ఏ వ్యవస్థను రద్దు (VRA System) చేస్తున్నామని సీఎం వివరించారు.

 

రాష్ట్రంలో వీఆర్ఏ ల (VRA) క్రమబద్ధీకరణ, సర్దుబాటు, స్థిరీకరణ తదితర అంశాలపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎం కేసీఆర్ ఆదివారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. వ్యవసాయం అభివృద్ధి చెంది సాగునీటి విధానం అమల్లోకి వచ్చిన నాటి కాలంలో ప్రతి గ్రామంలో నీటి వ్యవస్థను సక్రమంగా నిర్వహించడంతో పాటు గ్రామ రెవెన్యూ తదితర అవసరాల కోసం ఏర్పాటైన గ్రామ సహాయకుల వ్యవస్థ నేటి వీఆర్ఏలుగా రూపాంతరం చెందిందని సీఎం తెలిపారు. ఆ విధంగా తరతరాలుగా సామాజిక సేవ చేస్తున్న వీఆర్ఏల త్యాగపూరిత సేవ గొప్పదని కేసీఆర్ కొనియాడారు. కాగా నేటి మారిన పరిస్థితుల్లో వీఆర్ఏల వృత్తికి ప్రాధన్య‌తా తగ్గిన నేపథ్యంలో, వారికి రెవెన్యూ శాఖలో సూపర్ న్యూమరరీ పోస్టులను కల్పించి, పర్మినెంట్ చేసి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు.