Telangana Cabinet Meeting (photo-ANI)

Hyderabad, JAN 04: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన ఇవాళ క్యాబినెట్‌ (Telangana Cabinet Meeting) సమావేశం జరిగింది. క్యాబినెట్‌ తీసుకున్న నిర్ణయాలను రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. రైతులందరికీ శుభవార్త (Rythu Bharosha) వినిపించాలనుకుంటున్నామని అన్నారు. ప్రతి ఎకరానికి రూ.12 వేలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ నెల 26 నుంచి కొత్త రేషన్‌ కార్డులు (Ration Cards) ఇస్తామని అన్నారు. భూమిలేని వ్యవసాయ కుటుంబాలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని, ఈ పథకానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరు పెట్టామని తెలిపారు. ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా (Indiramma Athmiya Bhrosa), రేషన్‌ కార్డుల పథకాలను ప్రారంభిస్తామన్నారు. సాగులోలేని భూములకు రైతు భరోసా ఇవ్వబోమని అన్నారు. వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని తెలిపారు.

CM Revanth Reddy On Irrigation Department: నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం, పోలవరం నిర్మాణం - భద్రాచలం ముంపుపై కీలక ఆదేశాలు  

‘‘రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా సాయం అందిస్తాం. గత ప్రభుత్వం రైతు బంధు పథకం కింద ఏడాదికి రూ.10వేలు ఇస్తే.. ఈ ప్రభుత్వం రూ. 12 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. తండాలు, గూడేలు, మారుమూల గ్రామాలు, పల్లెల్లో ఉన్న భూమి లేని వ్యవసాయ రైతు కుటుంబాలకు ఏడాదికి రూ.12 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. భూమి లేకపోవడం ఒక శాపం అయితే.. ప్రభుత్వం కూడా ఆదుకోవడం లేదని పాదయాత్ర సమయంలో మా దృష్టికి వచ్చింది. అందుకే భూమిలేని వ్యవసాయ కుటుంబాలకు ఏడాది రూ.12వేలు ఇవ్వాలని నిర్ణయించాం. వారు కూడా సమాజంలో.. మనలో భాగమే అని గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ పథకానికి ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ అని నామకరణం చేశాం.

Telangana Cabinet Decisions

 

చాలా సంవత్సరాల నుంచి రాష్ట్రంలో రేషన్‌ కార్డుల సమస్య ఉంది. అందుకే రేషన్‌ కార్డు లేని అందరికి కొత్త రేషన్‌ కార్డు ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఈ పథకాలన్నింటినీ జనవరి 26 నుంచి అమలు చేస్తాం. మన రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా జనవరి 26 నుంచి ఈ పథకాలు అమలు చేయాలని నిర్ణయించాం. వ్యవసాయం యోగ్యం కాని భూములు.. రాళ్లురప్పలు ఉన్నవి, మైనింగ్‌ కోసం ఇచ్చినవి, రహదారి నిర్మాణంలో భాగంగా పోయినవి, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ వేసిన భూములు, పరిశ్రమలకు తీసుకున్న భూములు, రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములకు రైతు భరోసా ఇచ్చే ప్రసక్తే లేదు. దీనిపై రెవెన్యూ అధికారులు గ్రామాల వారీగా సమాచారం సేకరించి, గ్రామ సభలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తారు.

వ్యవసాయ భూముల్లో ఇతర కార్యకలాపాలు చేస్తున్నప్పటికీ రెవెన్యూ రికార్డుల్లో అప్‌డేట్‌ చేయలేదు. అందువల్ల కొంతమందికి గతంలో రైతు బంధు నిధులు వచ్చాయి. దయచేసి ఎవరికివారే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రభుత్వానికి వివరాలు అందించాలి. ప్రభుత్వ ఆదాయం పెంచడం.. పేదలకు పంచడం.. మా ప్రభుత్వ విధానం. ప్రస్తుతం ఉన్న వెసులుబాటు మేరకు నిజమైన రైతులకు మేలు చేయాలన్నదే మా ఆలోచన. అధికారుల వద్ద ఉన్న సమాచారం మేరకు ఈ పథకాలను అమలు చేస్తాం. ఈ సందర్భంగా మీడియా మిత్రులకు నా సూచన. సమచారాన్ని స్పష్టంగా ప్రజలకు వివరించండి. అనవసరమైన అంశాలు, వివాదాలకు తావివ్వొద్దు’’ అని సీఎం విజ్ఞప్తి చేశారు.