New Delhi DEC 12: ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగానికి (159కి.మీ.) అవసరమైన సాంకేతిక, ఆర్థికపరమైన అనుమతులు వెంటనే ఇవ్వాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో (Nitin Gadkari) గురువారం రాత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) భేటీ అయ్యారు. 2017లోనే ఆర్ఆర్ఆర్ (RRR) ఉత్తర భాగాన్ని 161ఏఏ జాతీయ రహదారిగా ప్రకటించారని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. ఇప్పటికే ఈ రహదారి నిర్మాణానికి అవసరమయ్యే భూమిలో 94 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం సేకరించిందని కేంద్ర మంత్రి దృష్టికి ముఖ్యమంత్రి తీసుకెళ్లారు. దక్షిణ కాశీగా గుర్తింపు పొందిన శ్రీశైలం క్షేత్రాన్ని హైదరాబాద్‌తో అనుసంధానించే ఎన్.హెచ్-765లో 125 కిలోమీటర్ల దూరం జాతీయ రహదారుల ప్రమాణాలతో ఉందని, మిగిలిన 62 కిలోమీటర్లు ఆమ్రాబాద్ అటవీ ప్రాంతంలో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అటవీ, పర్యావరణ శాఖ నిబంధనల ఫలితంగా ఆ మేరకు రహదారి అభివృద్ధికి ఆటంకంగా ఉందని, కేవలం పగటి వేళలో మాత్రమే రాకపోకలు సాగించాల్సి వస్తోందని కేంద్ర మంత్రికి సీఎం తెలిపారు.
CM Revanth Reddy Meets Union Minister Nitin Gadkari
తెలంగాణ మణిహారంగా చేపడుతున్న రీజినల్ రింగు రోడ్డు #RRR ఉత్తర భాగానికి (159 కి.మీ.) అవసరమైన సాంకేతిక, ఆర్థికపరమైన అనుమతులు వెంటనే ఇవ్వాలని ముఖ్యమంత్రి @revanth_anumula గారు జాతీయ రహదారుల శాఖ మంత్రి @nitin_gadkari గారికి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా… pic.twitter.com/HeuiPfHkfv
— Telangana CMO (@TelanganaCMO) December 12, 2024
ఆమ్రాబాద్ అటవీ ప్రాంతంలో నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని, ఇందుకు 2024-25 బడ్జెట్‌లో నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి గడ్కరీని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తే హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా మధ్య 45 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని ముఖ్యమంత్రి వివరించారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్య నగరాలైన హైదరాబాద్-విజయవాడ (ఎన్.హెచ్-65) రహదారిని 6 వరుసలుగా విస్తరించే పనుల డీపీఆర్‌ను (DPR) త్వరగా పూర్తి చేయాలని కేంద్ర మంత్రి గడ్కరీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఈ రహదారి విస్తరణ పనుల పూర్తయితే ప్రమాదాలకు అడ్డుకట్ట వేసి ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన వారమవుతామని చెప్పారు. తెలంగాణలోని రెండో పెద్ద నగరమైన వరంగల్ దక్షిణ భాగం బైపాస్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రి గడ్కరీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ను అనుసంధానించే ఎన్‌హెచ్-63 (16) వరంగల్, హన్మకొండ నగరాల మధ్యగా వెళుతోందని.. ఈ రహదారిని నగరం వెలుపల నుంచి నాలుగు చోట్ల కలుపుతూ బైపాస్ మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు.