CM KCR On Gajwel Tour | Photo: CMO

Gajwel, December 11:   బుధవారం తన సొంత నియోజకవర్గమైన గజ్వేల్ (Gajwel Constituency)లో  సీఎం కేసీఆర్ (CM KCR) పర్యటించారు.  తాను సీఎం అయిన దగ్గరి నుంచి నియోజకవర్గంలో చేపట్టిన ఎన్నో అభివృద్ధి పనులకు నేడు ప్రారంభోత్సవం చేశారు. కేసీఆర్ హయాంలో గజ్వేల్ పట్టణం మరియు సిద్ధిపేట జిల్లా ఒక రాష్ట్ర రాజధాని స్థాయిని తలదన్నే రీతిలో ఎన్నో అభివృద్ధి పనులకు నోచుకున్నాయి. నాలుగేళ్లలోనే నియోజకవర్గం రూపురేఖలను మార్చేసిన సీఎం కేసీఆర్, గజ్వేల్‌ను దేశంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. 

సీఎం కేసీఆర్ తన పర్యటనలో భాగంగా  నియోజకవర్గంలో కొత్తగా నిర్మించిన ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (FCRI) భవనాలు, కొండ లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్శిటీ,  గజ్వేల్ పట్టణంలో మహతి ఆడిటోరియం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ మరియు ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్‌ను  ప్రారంభించారు. అలాగే తల్లి మరియు పిల్లల సంరక్షణ ఆసుపత్రి, పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థకు పునాది రాళ్లు వేశారు.

గజ్వేల్ పట్టణంలో మహతి ఆడిటోరియం (Mahati Auditorium)ను సీఎం కేసిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ ఆడిటోరియంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖులతో సీఎం సమావేశమయ్యారు. ఆ ఆడిటోరియానికి మహతి అనే పేరును తానే పెట్టినట్లు సీఎం చెప్పారు. సంగీతంలో ఆరితేరినవాడు నారదుడు, ఆయన వీణ పేరే మహతి అని అన్నారు. తెలంగాణ సాహితీ సౌరభం ఈ మహతి ఆడిటోరియం, దీని నుంచి నలుదిశలా సాహిత్యపు వెలుగులు ప్రసరించాలి. అన్ని జిల్లా కేంద్రాల్లో ఇలాంటి హాళ్లు నిర్మించడానికి కృషి చేస్తామని సీఎం తెలిపారు.

CM KCR's Gajwel Tour:

 

గజ్వేల్‌లో ప్రతీ కుటుంబానికి ఏదో ఒకరకంగా ఆదాయం రావాలి, ప్రతి మనిషికి  చేతినిండా పని ఉండాలి. ప్రతి ఇల్లు పాడి పరిశ్రమతో కళకళలాడాలి. నియోజకవర్గంలోని ప్రతి పేద కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మిస్తాం అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఏ గ్రామంలో ఏముంది, ఏం కావాలి అనే అవగాహన స్థానిక నాయకుడికి ఉండాలి.  ఏ ఊరి సర్పంచ్ ఆ ఊరికి కథానాయకుడు కావాలి, ప్రజల మధ్య ఉండే ఏ రాజకీయ నాయకుడు రిలాక్స్ కావొద్దని సీఎం కేసీఆర్ అన్నారు.

2020 జనవరి నెలాఖరుకి గజ్వేల్‌ నియోజకవర్గానికి కాళేశ్వరం నీరు వస్తాయని సీఎం వెల్లడించారు.

సీఎం మాట్లాడుతూ, కంటి వెలుగు పథకం లాగే రాష్ట్ర ఆరోగ్య సూచిక రూపొందించాలనేది తన కోరిక అని తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాలలో ప్రతీ పౌరుడికి అతడి ఆరోగ్యాన్ని తెలిపే హెల్త్ ప్రొఫైల్ ఉంటుంది. తెలంగాణలో కూడా అందరికీ హెల్త్ ప్రొఫైల్ ఉండాలి అని కేసీఆర్ అన్నారు. గజ్వేల్ నియోజకవర్గం నుంచే ఈ కార్యక్రమం ప్రారంభించాలని అధికారులకు సీఎం సూచించారు. ప్రతీ కుటుంబ పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలి అని తెలిపారు.

KCR inaugurated new buildings in Gajwel: 

హైదరాబాద్ శివారు, గజ్వేల్ నియోజకవర్గంలోని ములుగులో అటవీ కళాశాల, పరిశోధన సంస్థ  భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా కళాశాల ఆవరణలో పైలాన్ ను ఆవిష్కరించి ఒక మొక్కను నాటారు. మంత్రులతో కలిసి కాలేజీ ప్రాంగణంలో కలియ తిరిగారు. అందులో చదివే అటవీ కళాశాల విద్యార్థులకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు.

సీఎంతో పాటు ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, ఈటెల రాజేందర్, శ్రీనివాస గౌడ్, నిరంజన్ రెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.