Hyderabad, DEC 11: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో (Greater Hyderabad) ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువకు పడిపోతుండడంతో చలి ప్రభావం (Cold Wave) పెరుగుతోంది. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1.7 డిగ్రీలు తగ్గి 29.3 డిగ్రీలుగాను, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1.3 డిగ్రీలు తగ్గి 17.7 డిగ్రీలు, గాలిలో తేమ 43శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD Hyderabad) అధికారులు వెల్లడించారు. అటు మన్యంలోని ప్రకృతి అందాలు మరింత సుందరంగా దర్శనమిస్తుండడంతో సందర్శకుల తాకిడి పెరిగింది. మంగళవారం ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉండడంతో జి.మాడుగులలో 13.5 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
అనంతగిరి, అరకులోయ, చింతపల్లిలో 15.8, డుంబ్రిగుడలో 16.1, జీకేవీధిలో 16.2, హుకుంపేటలో 16.3, పెదబయలులో 16.6, ముంచంగిపుట్టులో 16.9 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.వాతావరణంలోని మార్పులతో రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశముందని వాతావరణ నిపుణులు అంటున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా చలి తీవ్రత బాగా పెరిగింది. ఢిల్లీ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు చలికి గజగజ వణుకుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీతోపాటు జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, హర్యాణా, యూపీలో చలి తీవ్రత పెరిగింది.