HYD CP Anjani Kumar: ఫేక్ న్యూస్‌పై హైదరాబాద్ సీపీ వార్నింగ్, తప్పుడు ప్రచారం చేస్తే ఏడాది జైలు శిక్ష, జాతీయ విపత్తు నిర్వహణ మండలి చట్టం 5.1 ప్రకారం కేసులు, మీడియాతో అంజనీ కుమార్
Hyderabad police commissioner anjani kumar (Photo-IANS-ANI)

Hyderabad, Mar 15: ప్రస్తుతం కరోనా వైరస్‌ (CoronaVirus) వ్యాప్తిపై అనేక సామాజిక మాధ్యమాల్లో అవాస్తవాలు ప్రచారం అవుతున్నాయని వాటిని ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్‌ (Hyderabad CP Anjani Kumar)హెచ్చరించారు. కరోనా వైరస్‌ (CoronaVirus In Telangana) వ్యాప్తి చెందిందని అవాస్తవాలు సోషల్‌ మీడియాలో (Social Media) విపరీతంగా ప్రచారం కావడంతో సాధారణ ప్రజలు భయాందోళనలకు గురి అవుతున్నారని ఆయన అన్నారు.

పక్కా సమాచారం లేకుండా వచ్చిన మెసేజ్‌లను ఫార్వర్డ్‌ చేయకూడదని ఆయన తెలిపారు. అసత్యాలను ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని.. సెక్షన్‌ 54 ప్రకారం ఏడాది వరకూ శిక్షపడే అవకాశముందన్నారు.

వైరస్‌పై తప్పుడు వార్తలు ప్రచారం చేసినా, వదంతులు వ్యాపింపజేసినా చర్యలు తప్పవన్నారు. జాతీయ విపత్తు నిర్వహణ మండలి చట్టం 5.1 (NDMA act section 54.1) ప్రకారం అటువంటి వారిపై కేసులు నమోదు చేస్తామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వైరస్‌పై దుష్ప్రచారం చేస్తూ పట్టుబడితే ఏడాది వరకు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.

Here's CP Tweet

వదంతులు ప్రచారం చేయడమంటే సమాజానికి చెడు చేయడమేనని, వీటి వల్ల ప్రజలు భయాందోళనకు గురయ్యే అవకాశం ఉందని అంజనీకుమార్ అన్నారు. కాగా, దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 31 వరకు స్కూళ్లు, సినిమా హాళ్లు మూసివేస్తున్నట్టు ప్రకటించింది. కరోనా వైరస్ విషయంలో ప్రజలు భయభ్రాంతులకు గురికావాల్సిన అవసరం లేదని, పరిశుభ్రత పాటించడం ద్వారా దానికి దూరంగా ఉండొచ్చని ప్రభుత్వం సూచించింది.