
Hyderabad, OCT 25: బెటాలియన్ పోలీస్ కానిస్టేబుళ్ల కుటుంబాల (Constables Families) పోరాటం ఫలించింది. ఎట్టకేలకు దిగొచ్చిన ప్రభుత్వంలో గతంలో ఇచ్చిన జీవోను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ మేరకు స్పెషల్ అదనపు డీజీపీ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో సెలవుల విషయంలో తెలంగాణ బెటాలియన్ కానిస్టేబుళ్లకు (Battalion Constables) ఊరట లభించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు బెటాలియన్ కానిస్టేబుళ్లు 15 రోజులకు ఒకసారి సెలవుపై వెళ్లే అవకాశం ఉండేది. కానీ ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిబంధనలను మార్చి కొత్త లీవ్ మాన్యువల్‌ను (Leave Manual) అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కొత్త జీవోను విడుదల చేసింది.
దీని ప్రకారం ఇప్పటివరకు 15 రోజులకు ఒకసారి ఇంటికి వెళ్లిన కానిస్టేబుళ్లు.. ఇకపై 26 రోజులకు ఒకసారి ఇంటికి వెళ్లాల్సి వస్తుంది. ఈ మ్యాన్యువల్‌పై బెటాలియన్ కానిస్టేబుళ్ల కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే పలు బెటాలియన్ల ముందు ధర్నా చేయగా.. ఇవాళ సెక్రటేరియట్ ముట్టడికి కూడా యత్నించారు. దీంతో రేవంత్ సర్కార్ దిగొచ్చి ఆ జీవోను తాత్కాలికంగా నిలిపివేసింది.