
Hyderabad, May 2: తెలంగాణ మొన్న రాత్రి 8 గంటల నుంచి నిన్న రాత్రి 8 గంటల మధ్య 7,430 మందికి కరోనా పాజిటివ్ ( Telangana Coronavirus) నిర్ధారణ అయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం... ఒక్కరోజులో కరోనాతో 56 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 5,567 మంది కోలుకున్నారు.
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,50,790 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,67,727 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 2,368 గా ( Telangana Coronavirus Deaths) ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 80,695 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 1,546 మందికి కరోనా సోకింది.
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వైరస్ బారినపడిన వారిలో ఒక్కరు కూడా మరణించలేదని సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. టీకా తీసుకున్న తర్వాత ఆసుపత్రిలో చేరిన 15 మందీ కోలుకున్నారని తెలిపారు. బాధితుల్లో కొందరికి వెంటిలేటర్లు అవసరమైనా ఒక్కరి ఆరోగ్యం కూడా విషమించలేదని, అందరూ పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని వివరించారు. టీకా వేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలకు ఇది చక్కని ఉదాహరణ అని డాక్టర్ రాజారావు పేర్కొన్నారు.
గాంధీ ఆసుపత్రిలో ప్రస్తుతం 650 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారని, 400 మందికి ఆక్సిజన్ అందిస్తున్నట్టు చెప్పారు. వీరిలో దాదాపు 15 శాతం మంది వరకు ఇంట్లో చికిత్స తీసుకుని ఆ తర్వాత ఇక్కడకు వచ్చినవారేనని, 75 శాతం ప్రైవేటు ఆసుపత్రులలో చేరి డబ్బులు ఖర్చు చేసినా నయం కాకపోవడంతో ఆఖరి నిమిషంలో ఇక్కడకు వచ్చిన వారేనని తెలిపారు. చాలామంది భయంతో ముందే ఆసుపత్రులలో చేరడం వల్ల బెడ్స్ నిండిపోతున్నాయన్నారు. రక్తంలో ఆక్సిజన్ స్థాయి 95 శాతం కంటే ఎక్కువ ఉంటే ఆసుపత్రులలో చేరాల్సిన అవసరం లేదని డాక్టర్ రాజారావు తేల్చి చెప్పారు.