Coronavirus Test Center: నేటి నుంచి హైదరాబాద్‌లోనే కరోనావైరస్ నిర్ధారణ పరీక్షలు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకూ సేవలందిస్తామన్న తెలంగాణ మంత్రి ఈటెల రాజేంధర్
Gandhi Hospital, Hyderabad | File Photo

Hyderabad, February 03:  హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రి (Gandhi Hospital) లో సోమవారం నుంచి కరోనావైరస్ నిర్ధారణ పరీక్షలు (Coronavirus tests)  ప్రారంభించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేంధర్ (Etela Rajender) పేర్కొన్నారు. ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డును, కరోనావైరస్ డయాగ్నోస్టిక్ కిట్స్ కలిగిన వార్డులను ఆయన ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గాంధీ ఆసుపత్రిలోని వైరాలజీ యూనిట్ లో సోమవారం నుంచి వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహిస్తారు, వాటి రిపోర్ట్స్ కూడా గంటల్లోనే వస్తాయని వెల్లడించారు. ఇదివరకు రిపోర్ట్స్ ను పుణె ల్యాబ్ కు పంపేవారు, ఇక నేటి నుంచి గాంధీ ఆసుపత్రిలోనే నిర్ధారణ చేయనున్నారు.

ఈ వైరస్ చైనా నుంచి ప్రపంచంలోని అనేక దేశాలకు వ్యాప్తి చెందుతోంది. చైనా నుండి వస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం క్షుణ్ణంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి పేర్కొన్నారు. చైనా నుంచి భారతీయులను ఖాళీ చేయిస్తున్న కేంద్ర ప్రభుత్వం

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇక్కడే వైద్య పరీక్షలు నిర్వహిస్తామని, తెలంగాణ వారివే కాకుండా, ఆంధ్రప్రదేశ్ ప్రజల టెస్ట్ రిపోర్ట్స్ కూడా ఇక్కడే పరిశీలిస్తామని ఈటల వెల్లడించారు. చైనా నుంచి వచ్చిన వారిని 24 గంటలు అబ్జర్వేషన్ లో ఉంచుతామని తెలిపారు. ఇప్పటికే ఛాతీ ఆసుపత్రి, నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో అన్ని రకాల సౌకర్యాలతో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు. దేశంలో కరోనావైరస్ అంటువ్యాధి, వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ ఆసుపత్రులలో 24/7 పల్మోనాలజిస్టులను అందుబాటులో ఉంటారని మంత్రి పేర్కొన్నారు. కాగా, ఇప్పటివరకు తెలంగాణలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.